Excise policy case: సిసోడియాతో సహా నిందితుల ఆస్తులను సీజ్ చేసిన ఈడీ.. ఎన్ని కోట్లంటే..?
ABN , First Publish Date - 2023-07-07T20:41:19+05:30 IST
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారంనాడు సీజ్ చేసింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise Polcy)కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శుక్రవారంనాడు సీజ్ (Seize) చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియాకు చెందిన రెండు ఆస్తులు, రూ.11 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ కేసులో నిందితులైన వ్యాపారవేత్త అమన్‌దీప్ సింగ్ దల్, గౌతమ్ మల్హోత్రా, రాజేష్ జోషి ఆస్తులను కూడా ఈడీ సీజ్ చేసింది. ఈడీ సీజ్ చేసిన ఆస్తుల్లో రూ.44.29 కోట్ల చరాస్తులు, భూములు కూడా ఉన్నాయి.
ఎక్సైజ్ పాలసీకి చెందిన మనీ లాండరింగ్ కేసులో గత మార్చిలో అరెస్టయిన సిసోడోయా ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ కోరుతూ గత గురువారంనాడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ కింద లిక్కర్ వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసి, అందుకు ప్రతిగా భారీగా ముడుపులు అందుకున్నట్టు ఈడీ, సీబీఐ ఆరోపణగా ఉంది. అయితే ఈ ఆరోపణలను ఆప్ తోసిపుచ్చింది.