బీజేపీ మోదీత్వ రాజకీయాల్లో హనుమాన్ చాలీసా, భజరంగబళీ
ABN , First Publish Date - 2023-05-06T12:06:02+05:30 IST
హిందూత్వ నినాదంతో కాషాయ జెండాలు చేతబట్టి హనుమాన్ చాలీసాలు పఠిస్తూ జై భజరంగబళీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు...
న్యూఢిల్లీ : దేశంలో ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా పట్టించుకోని కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) సర్కారు... హిందూత్వ నినాదంతో కాషాయ జెండాలు చేతబట్టి హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠిస్తూ జై భజరంగబళీ అంటూ నినదించడాన్ని ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు హోరెత్తుతున్నాయి. 2014వ సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గత 8 ఏళ్ల పాలనలో హిందూత్వ (Hindutva) ఏజెండా రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో గతంలో ఏబీవీపీ విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదాన్ని లేవనెత్తింది. విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరిస్తే తాము కాషాయ కండువాలు వేసుకుంటామని ఏబీవీపీ విద్యార్థులు ప్రకటించారు. కోర్టు ఆదేశాలతో కర్ణాటక బీజేపీ సర్కారు విద్యాసంస్థలు, తరగతి గదుల్లో హిజాబ్ ధరించవద్దని ఆదేశించింది.
అలీఘడ్ యూనివర్శిటీలోనూ కళాశాల లాన్‌లో నమాజ్‌కు అనుమతిస్తే తాము కూడా హనుమాన్ చాలీసా పఠిస్తామని భారతీయ యువ మోర్చా హెచ్చరించింది. తాజాగా రాజకీయాల్లో హనుమాన్ చాలీసా రంగప్రవేశం చేసింది. గతంలో దశాబ్దాలుగా వందేమాతరం నినాదం ఉండేది. అయోధ్య రామాలయం ఉద్యమ సమయంలో జై శ్రీరాం నినాదం మార్మోగింది.అనంతరం మోదీ పాలనలో హనుమాన్ చాలీసా బహిరంగ పఠనం తెరమీదకు వచ్చింది. దీంతో హనుమాన్ భక్తులు ఆనందపడ్డారు. పురాతన మసీదుల్లో ముస్లింలు నమాజ్ చేయవద్దంటూ కోర్టుల్లో పిటిషన్లు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ రాణా దంపతులు కూడా హనుమాన్ చాలీసా పఠనాన్ని వివాదాస్పద అంశంగా మలిచి అరెస్ట్ కూడా అయ్యారు. మహారాష్ట్రతో పాటు యూపీలో సైతం మసీదుల సమీపాన పబ్లిక్ మైక్స్ పెట్టి హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ రైట్ వింగ్ వర్గాలు ముందుకొచ్చి ఉద్రిక్తతలు సృష్టించాయి.
దేశంలో కొవిడ్ అనంతరం వంటగ్యాస్ సబ్సిడీ దశలవారీగా తగ్గించినా, సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో రాయితీలు రద్దు చేసినా ఎవరూ ఉద్యమించలేదు. 1990వ సంవత్సరం తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ పాలనలోబజరంగ్ దళ్ భోపాల్ రైల్వేస్టేషనులో హిందూ రాష్ట్ర రాజధాని అంటూ బ్యానర్ కట్టారు. మళ్లీ తాజాగా పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేటపుడు జై భజరంగబళీ అని నినదించాలని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓటర్లకు పిలుపునిచ్చి సంచలనం రేపారు. గతంలో మైకుల్లో హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ యూపీ, మహారాష్ట్రాల్లో కొందరు నేతలు ప్రకటించారు. దీంతోపాటు కాంగ్రెస్ కార్యాలయాల ముందు తాము హనుమాన్ చాలీసా పఠిస్తామని బీజేపీ తాజాగా ప్రకటించింది.
ఇది కూడా చదవండి : Rajouri terror attack: రాజౌరి ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా హస్తం
మరోవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో హిందూత్వ నినాదాలు హోరెత్తుతున్నాయి. హిందూత్వ నినాదాలతో ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని బీజేపీ నేతలు వ్యూహం పన్నారు. కాంగ్రెస్ దూకుడుకు అడ్డు కట్ట వేసేందుకు మోదిత్వ రాజకీయాల్లో హిందూత్వ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనం, జై బజరంగబళీ నినాదాలు తెరమీదకు వచ్చాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పై నిషేధం హామీతో మొదలైన వివాదాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకోవడంతో దానికి కౌంటర్‌గా రాష్ట్రంలో హనుమంతుని ఆలయాలు నిర్మిస్తామని కాంగ్రెస్ నేత శివకుమార్ ప్రకటించారు. ఈ హిందూత్వ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనం తదితర పరిణామాలు కర్ణాటక ఎన్నికల ఫలితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయన్నది ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.