Eknath Shinde: జర్మనీ, బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్న సీఎం.. కారణం ఏమిటంటే?
ABN , First Publish Date - 2023-09-26T20:05:10+05:30 IST
మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శివసేన వైరి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ విచారణ చేపట్టడంతో జర్మనీ, బ్రిటన్ దేశాల్లో జరపదలచిన పర్యటనను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వాయిదా వేసుకున్నారు. విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
ముంబై: మహారాష్ట్ర (Maharashtra) రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. శివసేన వైరి వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) విచారణ చేపట్టడంతో జర్మనీ, బ్రిటన్ దేశాల్లో జరపదలచిన పర్యటనను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వాయిదా (postponed) వేసుకున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం తన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అనర్హత పిటిషన్లపై స్పీకర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుండగా, విచారణకు షిండే వర్గం ఎమ్మెల్యేలు హాజరుకావాల్సి ఉంది.
ఏకనాథ్ షిండే సారథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు గత ఏడాది జూన్‌లో తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో శివసేన రెండుగా చీలిపోయింది. బీజేపీతో చేతులు కలిపిన ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఉద్ధవ్ ధాకరే ప్రభుత్వం కుప్పకూలడంతో ఆయన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను ఆశ్రయించారు. అయితే, షిండే వర్గం తమదే నిజమైన శివసేన అంటూ థాకరే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మే 11న అసెంబ్లీ స్పీకర్‌ను నిర్దేశిత గడువులోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశింది. ఈ క్రమంలో స్పీకర్ నార్వేకర్ సోమవారం నుంచి అనర్హత పిటిషన్లపై ఇరువర్గాల ఎమ్మెల్యేల వాదనలు వింటున్నారు.
కాగా, షెడ్యూల్ ప్రకారం ఏక్‌నాథ్ షిండే అక్టోబర్ 1 నుంచి 10వ తేదీ వరకూ బెర్లిన్, జర్మనీ, లండన్‌లో అధికారిక పర్యటన జరపాల్సి ఉంది. పారిశ్రామిక టెక్నాలజీలపై ఒప్పందాలకు ఈ పర్యటన ఉద్దేశించగా, షిండే వెంట పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వెళ్లాల్సి ఉంది.