India Elections: జమిలి ఖాయమేనా? సీఈసీ కీలక వ్యాఖ్య
ABN , First Publish Date - 2023-09-07T01:41:16+05:30 IST
ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లే ముగియడానికి ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికల్ని ప్రకటించవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
6 నెలలు ముందుగానే ఎన్నికలు ప్రకటించవచ్చు
సాధారణ ఎన్నికలపై సీఈసీ వ్యాఖ్య
భోపాల్, సెప్టెంబరు 6: ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లే ముగియడానికి ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికల్ని ప్రకటించవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. అన్న విషయంపై వేసిన ఓ ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తాము పనిచేస్తామన్నారు. ఈ-వోటింగ్‌పై అడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. దానికి మరింత సమయం పడుతుందని చెప్పారు. ఆ విధానానికి హ్యాకింగ్ ముప్పుతోపాటు విశ్వసనీయత సమస్య ఉందన్నారు. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబరులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎన్నికల సంఘం ఉన్నత అధికారులు బుధవారం భోపాల్‌లో వివిధ రాజకీయ పార్టీలు, రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఈ ఎన్నికల్లో.. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే.. వారు ఇంటి వద్దే ఓటు వేసేలా ఓ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఇందుకు దరఖాస్తు చేస్తే.. ఎన్నికల అధికారులు వారి ఇంటికి వచ్చి రహస్యంగా ఓటు వేసేలా ఏర్పాటు చేస్తారని చెప్పారు. దీన్ని వీడియో తీయడంతోపాటు ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే నిర్వహిస్తామన్నారు. ఎన్నికల్లో ఉచిత హామీలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడుతూ.. ఓటర్లకు తాము ఏమి ఇవ్వబోతున్నామో చెప్పే హక్కు రాజకీయ పార్టీలకు ఉందన్నారు. ఉచిత హామీలపై ఎలక్షన్ కమిషన్ ఒక సవివర నివేదిక తయారుచేసిందని.. అయితే ఈ విషయం సుప్రీంకోర్టు ముందు ఉందని తెలిపారు.