Twitter : ఎలన్ మస్క్ మరో సంచలన నిర్ణయం
ABN , First Publish Date - 2023-01-22T12:00:50+05:30 IST
సామాజిక మాధ్యమాల్లో జెయింట్ కంపెనీ ట్విటర్ (Twitter)లో మరిన్ని మార్పులు జరగబోతున్న సంకేతాలు వస్తున్నాయి.
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో జెయింట్ కంపెనీ ట్విటర్ (Twitter)లో మరిన్ని మార్పులు జరగబోతున్న సంకేతాలు వస్తున్నాయి. ట్విటర్ సీఈఓ ఎలన్ మస్క్ (CEO Elon Musk) ఈ నెల 21న ఇచ్చిన ట్వీట్‌లో ట్విటర్లో వాణిజ్య ప్రకటనలు చాలా తరచుగా వస్తున్నాయని, అతి పెద్దగా ఉంటున్నాయని తెలిపారు. రానున్న వారాల్లో ఈ రెండిటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రకటనలు లేకుండా అత్యధిక ధరతో కూడిన సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుందన్నారు.
ఈ కొత్త ట్విటర్ బ్లూ టైర్ వివరాలు పూర్తిగా వెల్లడికాలేదు. మస్క్ మళ్లీ ట్వీట్ చేస్తేనే ఆ వివరాలు తెలుస్తాయి. ట్విటర్‌కు వచ్చే ఆదాయంలో 90 శాతం ఆదాయం డిజిటల్ యాడ్స్ సెల్లింగ్ వల్ల వస్తోంది. ఇటీవల ఈ ఆదాయం బాగా తగ్గిందని మస్క్ చెప్తున్నారు. అయితే ఆయన డిసెంబరులో చేసిన ప్రకటనలో, ట్విటర్ బేసిక్ బ్లూ టిక్ వల్ల ప్రకటనలు సగానికి తగ్గిపోతాయని చెప్పారు. 2023నాటికి ప్రకటనలు లేనటువంటి హయ్యర్ టైర్ అందుబాటులోకి వస్తుందన్నారు.
ఇదిలావుండగా, అలెస్సాండ్రో పెరిల్లి అనే ట్విటరాటీ ఇచ్చిన ట్వీట్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి మూడు ఫొటోలకు ఓ ప్రకటన వస్తోందని, పూర్తిగా చెత్త అనుభవం ఎదురవుతోందని, చాలా కాలం క్రితమే తాను ఇన్‌స్టాగ్రామ్‌ను వాడటం మానేశానని తెలిపారు. ట్విటర్‌లో తక్కువ ప్రకటనలు వచ్చేలా చేసి, విజువల్ కమ్యూనిటీస్‌కి ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను పెడితే, లక్షలాది మంది యూజర్లు మైగ్రేట్ అవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.