Delhi Liquor Scam Case: మనీష్ సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2023-03-10T19:14:31+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam Case) హైదరాబాద్‌లోనే జరిగిందని ఈడీ వెల్లడించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam Case) హైదరాబాద్‌లోనే జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కీలక నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ( former Delhi Deputy Chief Minister) మనీశ్ సిసోడియా(Manish Sisodia) కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లోనే స్కామ్‌కు కుట్ర జరిగిందని తెలిపింది. సౌత్‌గ్రూప్ దినేష్ అరోరాను హైదరాబాద్‌కు పిలిచిందని, విజయ్‌నాయర్, అర్జున్ పాండే, అభిషేక్ బోయినపల్లి, కవిత ఆడిటర్ బుచ్చిబాబు(Kavitha auditor Butchibabu Gorantla), అరుణ్ పిళ్లై కలిసే కుట్ర చేశారని ఈడీ స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరును మరోసారి ప్రస్తావించింది. కేజ్రీవాల్‌తో కవితకు స్పష్టమైన రాజకీయ సంబంధాలున్నాయని, కవితకు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులపై స్పష్టమైన అవగాహన కుదిరిందని కవిత ఆడిటర్ బుచ్చిబాబు విచారణలో వెల్లడించారని ఈడీ తెలిపింది. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీ ఉంటే ముడుపులు ఇస్తామని కవిత ఆప్ నేతలకు చెప్పారని ఈడీ తెలిపింది. 2021 మార్చిలో విజయ్‌నాయర్‌ను కవిత కలిశారని బుచ్చిబాబు చెప్పారని కస్టడీ రిపోర్ట్‌లో ఈడీ వెల్లడించింది. మాగుంట రాఘవకు 32.5శాతం, కవితకు 32.5శాతం... సమీర్ మహేంద్రుకు 35శాతం ఇండో స్పిరిట్స్‌లో వాటా కుదిరిందని, సౌత్ గ్రూప్ ద్వారా వందకోట్లు ఆప్‌కు చెల్లించారని ఈడీ తెలిపింది.
మరోవైపు సిసోడియా(Manish Sisodia)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ (CBI) రౌజ్ ఎవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) వారం రోజుల పాటు సిసోడియా ఈడీ కస్టడీ పొడిగించింది. అంతకు ముందు సిసోడియాను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో ఈడీ కోరింది. ఇప్పటివరకూ ఆయన సీబీఐ రిమాండ్‌లో ఉన్నారు. సీబీఐ రిమాండ్‌పై విచారణ ఇప్పటికే ఈ నెల 21కి వాయిదా పడగా తాజాగా న్యాయస్థానం ఆయన్ను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.
మనీశ్ సిసోడియాతో పాటు కలిపి విచారించేందుకు ఇప్పటికే ఏడుగురికి నోటీసులు జారీ చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు తెలిపారు. కవితకు, సిసోడియాకు ఉన్న వ్యాపార సంబంధాలపై ప్రశ్నిస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. కవిత, సిసోడియా, విజయ్ నాయర్ కుట్రకు పాల్పడ్డారని, సౌత్ గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లు ఆప్‌కి చెల్లించారని ఈడీ పేర్కొంది. సిసోడియా వాడిన ఫోన్లు, సిమ్ కార్డులు అతని పేరుపై లేవని.. తద్వారా సాక్ష్యాధారాలు లేకుండా చేయాలనుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు.
మద్యం హోల్‌సేల్ వ్యాపారాన్ని కొందరికి మాత్రమే దక్కేలా కుట్రపూరితంగా లిక్కర్ పాలసీని అమలు చేశారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కుట్రను విజయ్‌నాయర్, సౌత్ గ్రూపు కలిసి కోఆర్డినేట్ చేశారని, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ జరిగిందని ఈడీ పేర్కొంది. సిసోడియా తరపున విజయ్ నాయర్ ఈ వ్యవహారం నడిపారని.. ఈ వ్యవహారంపై కవిత, సిసోడియా మధ్య అవగాహన ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టుకు వివరించారు. 12 శాతం డీలర్ కమీషన్ అనే క్లాజ్‌ను పాలసీలో ఏకపక్షంగా చేర్చారని, ఇందులో మనీష్ సిసోడియా పాత్ర ప్రత్యక్షంగా ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు.