EPS: ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయరా?
ABN , First Publish Date - 2023-04-19T11:26:08+05:30 IST
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలను ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదని
ప్యారీస్(చెన్నై): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలను ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదని అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) స్పీకర్ అప్పావును నిలదీశారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎడప్పాడి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం చేయాల్సి ఉందని, అయితే రాజకీయ దురుద్దేశంతో అన్నాడీఎంకే(AIADMK) సభ్యులు మాట్లాడే దృశ్యాలను ప్రసారం చేయడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న స్పీకర్ అప్పావు మాట్లాడుతూ.. దీనిపై ఇప్పటికే సమగ్రమైన వివరణ ఇచ్చామని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో అన్ని పార్టీలను ప్రభుత్వం సమానంగా చూస్తోందన్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు ఎప్పుడు మాట్లాడతారో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసెంబ్లీ సమావేశ ఘట్టాలను ప్రజల ముందుంచాలన్న ఉద్దేశంతోనే ప్రత్యక్ష ప్రసారాలను ఇస్తోందన్నారు. 110 ఆర్టికల్ కింద వచ్చే అన్ని అంశాలను ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నామన్నారు. జీరో అవర్‌లో ఎవరు, ఏ అంశంపై మాట్లాడతారో తమకు ముందుగా తెలియదన్నారు. అజెండాలోని అన్ని అంశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కృషి చేస్తామన్నారు. జీరో అవర్‌లో ఆయా పార్టీల నేతలు మాట్లాడేదానిని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవకాశం లేదన్నారు. ప్రతిపక్షం, పాలకపక్షం అనే తేడా లేకుండా, ప్రజాస్వామ్యయుతంగానే వ్యవహరిస్తున్నామని స్పీకర్ తెలిపారు.
ఇదికూడా చదవండి: ఏయ్.. ఎవరు దొంగ. నువ్వే ఒక ఫ్రాడ్.. అంటూ..