Ajit Pawar: బీజేపీ-శివసేన సర్కార్‌కు ముప్పు లేదు... అజిత్ పవార్ సంచలన వ్యాఖ్య
ABN , First Publish Date - 2023-05-15T17:58:28+05:30 IST
ముంబై: ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై ఒకవేళ అనర్హత వేటు పడినా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన సర్కార్‌కు ఎలాంటి ముప్పు ఉండదని సోమవారంనాడు అన్నారు.
ముంబై: ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మరోసారి సంచలన వ్యాఖ్య చేశారు. మహారాష్ట్ర సంక్షోభ సమయంలో తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై ఒకవేళ అనర్హత వేటు పడినా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ-ఏక్‌నాథ్ షిండే శివసేన సర్కార్‌కు ఎలాంటి ముప్పు ఉండదని సోమవారంనాడు అన్నారు. అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరుతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం కానప్పటికీ, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకుని ఆయన మాట్లాడి ఉండవచ్చని చెబుతున్నారు.
మహారాష్ట్రలోని అధికార కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం 162 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య కంటే 17 ఎక్కువ. బీజేపీ, శివసేన కలిసి 145 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
'మహా' సంక్షోభం...సుప్రీంకోర్టు తీర్పు
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ ప్రభుత్వం కొద్దికాలం క్రితం అధికారం కోల్పోయింది. శివసేనలో చెలరేగిన తిరుగుబాటు ఇందుకు కారణమైంది. ఏక్‌నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మహాకూటమిలో కొనసాగేందుకు నిరాకరించి వేరుకుంపటి పెట్టడంతో శివసేన రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్ థాకరే సీఎం పదవికి రాజీనామా చేసి తమదే నిజమైన శివసేన అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉద్ధవ్ రాజీనామా చేయగానే షిండే వర్గం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేనకు తాను రాజీనామా చేయలేదని, తమదే నిజమైన శివసేన అని, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశామని షిండే అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదన వినిపించారు. ఈ క్రమంలోనే షిండే వర్గాన్ని నిజమైన శివసేనగా గత ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీ గుర్తును కూడా వారికే కేటాయించింది.
కాగా, మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పునిచ్చింది. చీఫ్ విప్ నియామకంపై అప్పటి మహారాష్ట్ర గవర్నర్ , స్పీకర్‌ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయితే ఉద్దవ్‌థాక్రే విశ్వాసపరీక్షను ఎదుర్కోలేదని, అందుకే ఆయన్ను తిరిగి సీఎంగా నియమించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. షిండే వర్గానికి చెందిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదని, ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో సీఎం షిండేకు ఊరట లభించింది.