Former Chief Minister: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌

ABN , First Publish Date - 2023-03-10T10:28:12+05:30 IST

సుప్రీంకోర్టు తీర్పుతో ఉత్సాహంలో వున్న అన్నాడీఎంకే(AIADMK) నేతలు.. తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పా

Former Chief Minister: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు తీర్పుతో ఉత్సాహంలో వున్న అన్నాడీఎంకే(AIADMK) నేతలు.. తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి (Former Chief Minister Edappadi Palani Swamy)ను ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా వున్న ఆయనకు పదోన్నతి కల్పించేందుకు రంగం సిద్ధం చేశారు. స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు పార్టీ జిల్లా శాఖల నేతల భేటీ జరిగింది. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుసేన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈపీఎస్‌తో పాటు డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేపీ మునుసామి, మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, సెంగోటయ్యన్‌, దిండుగల్‌ శీనివాసన్‌, ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూరు కె.రాజు, వలర్మతి, నత్తం విశ్వనాథన్‌, దళవాయి సుందరం, జిల్లా కార్యదర్శులు బాలగంగా, వీఎన్‌ రవి, వెంకటేష్‌బాబు, టి.నగర్‌ సత్యా, ఆర్‌ఎస్‌ రమేష్‌, ఆదిరాజారామ్‌, కేపీ కందన్‌, చిట్లపాక్కం రాజేంద్రన్‌ తదితర ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా సర్వసభ్యమండలి సమావేశాన్ని నిర్వహించి, పార్టీ పగ్గాలు ఈపీఎస్‌కు అప్పగించాలని నేతలు సూచించారు. అదే విధంగా ఇటీవలి కాలంలో రాష్ట్ర బీజేపీ నాయకులు అనుసరిస్తున్న తీరుపైనా మెజారిటీ నేతలు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కొందరు సీనియర్లు బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఈపీఎస్‌కు సూచించినట్లు సమాచారం. అన్నాడీఎంకే సర్వసభ్యమండలి తీర్మానాలను రద్దు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) వర్గానికి చెందిన శాసనసభ్యుడు మనోజ్‌ పాండ్యన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 17న విచారణ జరుగనున్న విషయంపై కూడా ఈపీఎస్‌ నేతలతో చర్చించారు. బీజేపీ, అన్నాడీఎంకే మధ్య కొనసాగుతున్న అభిప్రాయ భేదాలు, బీజేపీ నేత అన్నామలై దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. బీజేపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని ఈపీఎస్‌ సూచించినట్లు తెలిసింది.

ఈపీఎస్‌ నిర్ణయమే శిరోధార్యం: మునుస్వామి

ఈ సమావేశం ముగిశాక పార్టీ సీనియర్‌ నేత కేపీ మునుస్వామి విలేఖరులతో మాట్లాడుతూ... తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఈపీఎస్‌ నిర్ణయమే శిరోధార్యమని, ఆయనకు జిల్లా నేతలంతా గట్టి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. పార్టీలో సంక్షోభాలన్నింటినీ ఈపీఎస్‌ సమర్థవంతంగా ఎదుర్కొని, న్యాయపోరాటాల్లోనూ విజయం సాధించారన్నారు. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఈపీఎస్‌కు బాగా తెలుసని, పార్టీ శ్రేణులు ఇక లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-10T10:28:50+05:30 IST