Former CM: బీజేపీని గద్దె దించేందుకు అందరం ఏకమవుదాం..
ABN , First Publish Date - 2023-06-21T12:07:14+05:30 IST
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పుదుచ్చేరి మాజీ ముఖ్య
పుదుచ్చేరి, (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి(Former Chief Minister of Puducherry Narayanaswamy) పిలుపునిచ్చారు. పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముప్పెరుం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ తరఫున 50కి పైగా పేద కుటుంబాలకు సహాయాలను నారాయణస్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశ సమైక్యత కోసం, ప్రజలు ఆర్థికంగా మెరుగుపడాలన్న దృష్టితో పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకొనేలా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా... కిరణ్ బేదీని గవర్నర్‌గా నియమించారని, అయినా ప్రజల సహకారంతో తమ పాలన ఐదేళ్లు సాగిందన్నారు. తమిళనాట ప్రజలు మెచ్చే పాలన అందిస్తున్న సీఎం స్టాలిన్(CM Stalin)కు కూడా ఇబ్బందులు కలిగించే విధంగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్, ఇన్‌కం టాక్స్, సీబీఐతో ప్రతిపక్షాలపై దాడులు నిర్వహించడం దారుణమన్నారు. ఈ నెల 23న జాతీయస్థాయిలో జరగనున్న విపక్షాల సమావేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా కాంగ్రెస్ నేతృత్వంలో పార్టీలు ఏకం కావాలని నారాయణస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు.