Former CM: మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు.. మీరు చేసేది ఇదేనా.. కపట నాటకాలు వద్దు
ABN , First Publish Date - 2023-08-06T08:14:02+05:30 IST
కావేరి జలాల(Kavery waters) కోసం కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కపటనాటకాలాడుతున్నారని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాల(Kavery waters) కోసం కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కపటనాటకాలాడుతున్నారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) మండిపడ్డారు. స్థానిక తిరువొత్తియూరులో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే కుప్పన్ కుమారుడు మోహన్ చిత్రపటానికి శనివారం నివాళులర్పించిన ఈపీఎస్.. విలేఖరులతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా కావేరి జలాల సాధనలో తీరని నష్టాలే ఎదురవుతున్నాయని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత, తాను కావేరి జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను కాపాడేదిశగా సుదీర్ఘ న్యాయపోరాటమే జరిపామని, ఫలితంగా సుప్రీంకోర్టు కావేరి జలాల నిర్వాహక మండలి ఏర్పాటు చేసి, రాష్ట్రానికి కర్ణాటక నెలలవారీగా విడుదల చేయాల్సిన జలాల పరిమాణాలను కూడా ఖరారు చేసిందన్నారు. 1974లో డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి కావేరి జలాల ఒప్పందాన్ని రెన్యూవల్ చేయకపోవడం వల్ల అప్పటిదాకా పొందుతూ వచ్చిన 500 టీఎంసీలను ప్రస్తుతం పొందలేకపోతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ రాష్ట్రానికి ఏ సమస్య ఎదురైనా వెంటనే ప్రధాని మోదీకి, రాష్ట్రపతికి లేఖలు రాసి చేతులు దులిపేసుకుంటున్నారని, సమస్యలను అర్థం చేసుకోకుండా లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్(Chief Minister Siddaramaiah and Deputy Chief Minister Sivakumar) ఇద్దరూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఆప్త మిత్రులేనని, కనుక వెంటనే బెంగళూరు బయలుదేరి వారితో చర్చలు జరపాలని ఈపీఎస్(EPS) డిమాండ్ చేశారు. అదే సమయంలో మెకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం వంతెన నిర్మించేందుకు ఇటీవలే భూమికొలతలు కూడా చేపట్టిందని, ఈ విషయంలోనూ స్టాలిన్ అప్రమత్తంగా వ్యహిరించి మెకెదాటును అడ్డుకోవాలని కోరారు. కావేరి జలాలు అందకపోతే అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఆందోళన జరిపేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఈపీఎస్ హెచ్చరించారు.