Former CM: మాజీసీఎంకు షాకిచ్చిన హైకోర్టు.. అసలు ఏం జరిగిందంటే...
ABN , First Publish Date - 2023-08-26T07:28:44+05:30 IST
అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)కు మద్రాసు హైకోర్టు
- పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ నియామకం సబబేనని స్పష్టీకరణ
- అన్నాడీఎంకే తీర్మానాలకూ సమర్థన
- ఓపీఎస్ బృందం పిటిషన్ల తోసివేత
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam)కు మద్రాసు హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) అధ్యక్షతన జరిగిన సర్వసభ్యమండలి తీర్మానాలన్నీ చట్ట ప్రకారం చెల్లుబాటవుతాయని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.మహాదేవన్, జస్టిస్ మహమ్మద్ షబీక్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. గత ఏడాది అన్నాడీఎంకే(AIADMK)లో ద్వంద్వ నాయకత్వానికి పార్టీ నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. పార్టీ సమన్వయకర్త (ఓపీఎస్), ఉప సమన్వయకర్త (ఈపీఎస్) పదవులు అనవసరమని, ఏక నాయకత్వమనే వాదన తీవ్రరూపం దాల్చాయి. ఆ నేపథ్యంలో గతేడాది జూలై 11న ఈపీఎస్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఆయన్నే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంతేగాక పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఓపీఎ్‌సను బహిష్కరించారు. దాంతో ఆ తీర్మానాలను వ్యతిరేకిస్తూ ఓపీఎస్(OPS), ఆయన అనుచరులైన మనోజ్ పాండ్యన్, ఆర్.వైద్యలింగం, జేసీడీ ప్రభాకరన్ తదితరులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి అన్నాడీఎంకే సర్వసభ్యమండలి తీర్మానాలు చెల్లుబాటవుతాయని తీర్పు వెలువరించారు. ఆ తీర్పుపై ఓపీఎస్ వర్గాలు సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు(Supreme Court) ఆ అప్పీలుపై విచారణ జరిపి అన్నాడీఎంకే(AIADMK) సర్వసభ్యమండలి తీర్మానాలు చెల్లుతాయా లేదా అనే విషయంపై హైకోర్టే విచారణ జరపాలని ఆదేశించింది. ఆ మేరకు హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అన్ని పక్షాల వాదప్రతివాదనల తర్వాత గత జూన్ 28న తేదీ ప్రకటించకుండా తీర్పును వాయిదా వేసింది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈపీఎస్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్యమండలి సమావేశం తీర్మానాలు చెల్లుబాటవుతాయని, అదే విధంగా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక కూడా చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఇదివరకే సుప్రీంకోర్టు అన్నాడీఎంకే సర్వసభ్య మండలి తీర్మానాలకు అంగీకారం తెలిపిందని, ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ప్రకటనపై స్టే విధించలేమని కూడా తేల్చి చెప్పింది. ఇక ఓపీఎస్‌ను పార్టీ నుండి బహిష్కరించడంపై కూడా స్టే ఉత్తర్వులు జారీ చేయలేమని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఓపీఎస్, ఆయన వర్గీయులు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.
ధర్మం గెలిచింది: ఈపీఎస్
అన్నాడీఎంకే సర్వసభ్యమండలి తీర్మానాలన్నీ చట్ట ప్రకారం చెల్లుబాటవుతాయంటూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో న్యాయం, ధర్మం, సత్యం గెలిచాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువడగానే సేలం జిల్లాలోని తన స్వస్థలం సిలువంపాళయంలోని నివాసగృహం వద్ద ఈపీఎస్ పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాజా తీర్పుతో పార్టీ మరింత బలం పుంజుకుందని, వచ్చే యేడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ఘనవిజయం సాధిస్తుందన్నారు. న్యాయం తమవైపు ఉండటం వల్లే హైకోర్టు తీర్పు సానుకూలంగా వెలువడిందన్నారు. కొడనాడు ఎస్టేట్ వద్ద జరిగిన హత్య, దోపిడీ కేసులతో తనకు సంబంధం ఉన్నట్లు వదంతులు పుట్టిస్తున్నారని, తాను సీఎంగా ఉన్నప్పుడు కొడనాడు ఎస్టేట్ కేసులను సమర్థవంతంగా విచారణ జరిపించానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం దాన్ని పక్కదోవపట్టించి లేనిపోని నేరారోపణలు చేయడానికి కుట్రపన్నుతోందని ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేసిన నేరస్థుడు ధనపాల్‌పై ఎన్నో కేసులు నమోదై ఉన్నాయని, అలాంటి వ్యక్తి చెప్పే మాటలు అవాస్తవాలుగానే ఉంటాయన్నారు. కొడనాడు ఎస్టేట్ హత్య, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకరాజ్ మాజీ ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్ కాదని, అతడు శశికళకు కారు డ్రైవర్ అని తెలిపారు. ఇక మీదట కనకరాజ్‌ను జయ కారు డ్రైవర్ అని చెబితే కేసు వేస్తామని హెచ్చరించారు.
అన్నాడీఎంకేలో హర్షాతిరేకాలు
అన్నాడీఎంకే తీర్మానాలపై మద్రాస్ హైకోర్టులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడికి అనుకూల తీర్పు వెలువడడంతో ఆయన మద్దతుదారులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. స్థానిక రాయపురంలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ యువజన విభాగ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలోని వందలాదిమంది కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చారు. అదే విధంగా కొబ్బరినీరుతో ఎడప్పాడి చిత్రపటానికి అభిషేకం చేయడంతో పాటు వందలాది కొబ్బరిబోండాలను కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ తమిళమగన్ హుసేన్, మాజీ మంత్రి డి.జయకుమార్, సేలం సబర్బన్ జిల్లా కార్యదర్శి ఇళంగోవన్ తదితరులు కూడా పాల్గొన్నారు.