Supreme Court Vs Centre : కిరణ్ రిజిజుపై జస్టిస్ నారిమన్ ఆగ్రహం
ABN , First Publish Date - 2023-01-28T18:50:05+05:30 IST
న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై
ముంబై : న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రొహింటన్ ఫాలి నారిమన్ విరుచుకుపడ్డారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫారసులను ఆమోదించడంపై ఎటూ తేల్చకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని హెచ్చరించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనే చిట్టచివరి దుర్గం పతనమైతే, దేశం నూతన చీకటి యుగ అగాధంలోకి ప్రవేశిస్తుందన్నారు.
నారిమన్ (Rohinton Fali Nariman) శుక్రవారం ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, స్వతంత్ర, నిర్భయ న్యాయమూర్తుల నియామకం జరగకపోతే న్యాయ వ్యవస్థకు స్వతంత్రత ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ‘‘ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే, దానికి ఆ ఉప్పదనాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి?’’ అని సామాన్యుడు ప్రశ్నించుకుంటాడన్నారు. న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫారసుపై 30 రోజుల్లోగా కేంద్రం స్పందించకపోతే, ఇక దానికి స్పందించడానికేమీ లేదని భావించి, ఆ సిఫారసును తాను అమలు చేసే విధంగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు (Supreme Court) ప్రత్యేక ధర్మాసనం ఓ తీర్పును ఇవ్వాలని పిలుపునిచ్చారు. సిఫారసులపై స్పందించకుండా కూర్చోవడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని చెప్పారు. ‘‘ఫలానా కొలీజియం రావాలని, అది వస్తే దాని మనసు మార్చుకుంటుందని మీరు ఎదురు చూస్తున్నారు’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. సమంజసమైన సమయంలో న్యాయమూర్తుల నియామకం తప్పనిసరిగా జరగాలన్నారు.
జస్టిస్ నారిమన్ జడ్జిగా తన పదవీ విరమణ వరకు ( 2021 ఆగస్టు వరకు) సుప్రీంకోర్టు కొలీజియం సభ్యునిగా ఉన్నారు. కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఇటీవల అనేక సందర్భాల్లో కొలీజియం వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankar) కూడా ఇదేవిధంగా స్పందించారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి తీవ్ర విఘాతమని ఆరోపించారు.