Ashok Gehlot on Modi: మోదీ మొండితనం వల్లే రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి
ABN , First Publish Date - 2023-06-05T21:02:57+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండితనం వల్లే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. మరిన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కోల్పోనుందని జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మొండితనం (Stubbornness) వల్లే హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (BJP) ఓటమి పాలైందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అన్నారు. మరిన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కోల్పోనుందని జోస్యం చెప్పారు. రాజస్థాన్ దివస్ సందర్భంగా సోమవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని అప్పటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానికి సూచించినప్పటికీ ప్రధాని పెడచెవిన పెట్టారని అన్నారు. పాత పెన్షన్ పథకం పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ, ప్రధాని మొండివైఖరి వల్ల బీజేపీ ఓటమిపాలైందని గెహ్లాట్ అన్నారు. ప్రజాస్వామ్యంలో మొండితనానికి తావు లేదని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటరుకు ఎవరైనా తలవంచాల్సిందనేనని, ప్రజలు ఓటుతోనే ఎవరైనా గెలుపు సాధించగలరని అన్నారు.
రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం ఆమోదించిన ఆరోగ్య హక్కు బిల్లు-2022ని ప్రధాని పరిశీలించాలని కోరారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా విపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే ఎలాంటి అంశం లేదన్నారు. ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను ఆపివేయడం సరికాదని, వసుంధరా రాజే ప్రభుత్వం ప్రారంభించిన ఈస్ట్రన్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం ఆపలేదని, దానిని జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తే త్వరగా పూర్తవుతుందని కేంద్రానికి సూచించారు. ఇటీవల ప్రధాని అజ్మీర్ పర్యటనలో దీనిపై ప్రకటన చేస్తారని తాను ఆశించినప్పటికీ అలా జరగలేదని గెహ్లాట్ అన్నారు.