Manipur violence : మణిపూర్ హింసాకాండలో విదేశీ హస్తం : మాజీ సైన్యాధిపతి
ABN , First Publish Date - 2023-07-29T12:00:05+05:30 IST
మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.
న్యూఢిల్లీ : మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు. ‘జాతీయ భద్రతా దృక్పథం’ అనే అంశంపై ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో విలేకర్లతో మాట్లాడుతూ జనరల్ నరవనే ఈ వ్యాఖ్యలు చేశారు.
చర్యలు తీసుకునే పదవుల్లో ఉన్నవారు అత్యుత్తమంగా పని చేస్తున్నారని చెప్పారు. విదేశీ సంస్థల ప్రమేయాన్ని కొట్టి పారేయలేమని, విదేశీ శక్తుల ప్రమేయం ఉందని కచ్చితంగా చెప్తున్నానని తెలిపారు. ముఖ్యంగా చైనా సహాయం వివిధ తిరుగుబాటు సంస్థలకు ఉందని తెలిపారు. మణిపూర్‌లోని తిరుగుబాటుదారులకు చైనా సహాయం చాలా కాలం నుంచి అందుతోందని, ఇప్పుడు కూడా కొనసాగుతోందని చెప్పారు.
మణిపూర్‌లో ప్రస్తుత హింసాకాండ వెనుక మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారుల పాత్ర గురించి అడిగినపుడు జనరల్ నరవనే స్పందిస్తూ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చాలా కాలం నుంచి జరుగుతోందన్నారు. స్వాధీనం చేసుకుంటున్న మాదక ద్రవ్యాల పరిమాణం రాన్రానూ పెరుగుతోందన్నారు. మన దేశం థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ కలిసే స్వర్ణ త్రిభుజి (గోల్డెన్ ట్రయాంగిల్)కు అతి సమీపంలో ఉందని తెలిపారు. మయన్మార్‌లో ఎల్లప్పుడూ అస్థిరత, సైనిక పాలన ఉంటున్నాయన్నారు. మయన్మార్‌లో పరిపాలన సజావుగా జరిగిన కాలంలో కూడా కేవలం సెంట్రల్ మయన్మార్‌పైన మాత్రమే ప్రభుత్వానికి నియంత్రణ ఉండేదని, భారత్ లేదా చైనా లేదా థాయ్‌లాండ్ సరిహద్దులోని రాష్ట్రంపై నియంత్రణ ఉండేది కాదని అన్నారు. కాబట్టి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఎల్లప్పుడూ జరుగుతోందన్నారు.
మణిపూర్ హింస వల్ల లబ్ధి పొందే సంస్థలు, శక్తులు ఉండవచ్చునని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనకూడదని ఆ సంస్థలు, శక్తులు కోరుకుంటుండవచ్చునని, అస్థిరత కొనసాగుతున్నంత కాలం తాము లబ్ధి పొందవచ్చుననే ఉద్దేశం వాటికి ఉండవచ్చునని తెలిపారు. హింస కొనసాగడానికి కారణాల్లో ఇదొకటి కావచ్చునని తెలిపారు. ప్రశాంతతను పునరుద్ధరించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయన్నారు.
అగ్నిపథ్ గురించి...
సైనిక నియామకాల ప్రక్రియ అగ్నిపథ్ గురించి అడిగిన ప్రశ్నకు జనరల్ నరవనే సమాధానం చెప్తూ, విస్తృత స్థాయిలో చర్చించిన తర్వాతే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు ఆర్థికంగా ఆదా చేయడం కోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని కొందరు ఆరోపిస్తున్నారన్నారు. అయితే మనకు యువ సైన్యం అవసరమని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Manipur : మణిపూర్ బయల్దేరిన ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు
Bharat Jodo Yatra : ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టితో మరోసారి రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’