UPI Payments : మన దేశంలో కూరగాయలు కొని, డిజిటల్ పేమెంట్ చేసి, మంత్రముగ్ధుడైన జర్మన్ మంత్రి
ABN , First Publish Date - 2023-08-20T21:19:12+05:30 IST
మన దేశంలో సామాన్యులు సైతం తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేస్తూ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. టీ, కాఫీల నుంచి కూరగాయల వరకు, స్నేహితులకు అవసరమైనపుడు ఆదుకోవడం దగ్గర నుంచి, మొబైల్ రీఛార్జ్‌లు,అనేక అవసరాలను డిజిటల్ లావాదేవీలతో తీర్చుకోగలుగుతున్నారు.
న్యూఢిల్లీ : మన దేశంలో సామాన్యులు సైతం తమ మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ పేమెంట్లు చేస్తూ టెక్నాలజీ వల్ల కలిగే ప్రయోజనాలను ఆస్వాదిస్తున్నారు. టీ, కాఫీల నుంచి కూరగాయల వరకు, స్నేహితులకు అవసరమైనపుడు ఆదుకోవడం దగ్గర నుంచి, మొబైల్ రీఛార్జ్‌లు, పన్ను చెల్లింపులు, బస్సులు, రైళ్ల టిక్కెట్ బుకింగ్‌లు వంటి అనేక అవసరాలను డిజిటల్ లావాదేవీలతో తీర్చుకోగలుగుతున్నారు. భారతీయులు ఇంత సునాయాసంగా ఆర్థిక లావాదేవీలు జరుపుకుంటుండటాన్ని చూసి జర్మన్ ఫెడరల్ మంత్రి వోల్కర్ విస్సింగ్ మంత్రముగ్ధుడయ్యారు. ఆయన కొన్న కూరగాయలకు ఈ విధానంలో డబ్బు చెల్లించి స్వయంగా అనుభూతి పొందారు. యూపీఐ పేమెంట్స్ భారత దేశంలో చాలా సునాయాసంగా జరుగుతున్నాయని ప్రశంసించారు.
న్యూఢిల్లీలోని జర్మన్ ఎంబసీ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, జర్మన్ డిజిటల్, ట్రాన్స్‌పోర్ట్ శాఖల ఫెడరల్ మంత్రి వోల్కర్ విస్సింగ్ భారత దేశంలోని యూపీఐ పేమెంట్ల విధానాన్ని ప్రశంసించారు. ఆయన ఆదివారం ఓ కూరగాయల దుకాణంలో కూరగాయలు కొని, డబ్బును యూపీఐ విధానంలో చెల్లించారని తెలిపింది. భారత దేశం సాధించిన విజయాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అని తెలిపింది. కొన్ని సెకండ్లలోనే లావాదేవీలు జరపడానికి యూపీఐ ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తోందని చెప్పింది. లక్షలాది మంది భారతీయులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారని పేర్కొంది. విస్సింగ్ స్వయంగా ఈ అనుభూతిని ఆస్వాదించి, మంత్రముగ్ధుడయ్యారని తెలిపింది.
విస్సింగ్ ఈ నెల 19న బెంగళూరులో జరిగిన జీ20 డిజిటల్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ఈ నెల 18న బెంగళూరు చేరుకున్నారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది భారత దేశపు మొబైల్ బేస్డ్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్. రోజులో ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్షణం సొమ్ము చెల్లించేందుకు, స్వీకరించేందుకు ఈ విధానం అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు శ్రీలంక, ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ ఈ ఫిన్‌టెక్, పేమెంట్ సొల్యూషన్స్‌లో భారత దేశంతో భాగస్వాములయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Congress : సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ.. గాంధీలతో పాటు సచిన్, థరూర్‌లకు చోటు..