Gold coins: ప్రభుత్వం మరో పథకం.. పెళ్లికూతుళ్లకు బంగారు నాణేలు
ABN , First Publish Date - 2023-10-08T10:31:39+05:30 IST
ఈ యేడాది నాలుగు పథకాల కింద 25 వేల మంది నవ వధువులకు బంగారు నాణేలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- 25 వేలమందికి రూ.117.18 కోట్ల కేటాయింపు
అడయార్(చెన్నై): ఈ యేడాది నాలుగు పథకాల కింద 25 వేల మంది నవ వధువులకు బంగారు నాణేలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.117.18 కోట్లను కేటాయించింది. మాజీ ముఖ్యమంత్రులైన దివంగత జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి సీఎంలుగా ఉన్న సమయంలో నవ వధువులకు ఉపయోగపడేలా అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం... మంగళసూత్రానికి బంగారం (తాళికి తంగం) అనే పథకం ప్రవేశపెట్టింది. దీనిని పుదుపెణ్ (నవ వధువు) అనే పథకంగా పేరు మార్చారు. ఈ పథకం కింద ఒక బాలికకు 12వ తరగతి తర్వాత డిగ్రీలో చేరితే, అది పూర్తయ్యేంతవరకు నెలకు రూ.1000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి దివంగత కలైంజర్ గతంలో ‘మణియమ్మై’ పేరుతో ఒక వివాహ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం కింద వధూవరులిద్దరూ పట్టభద్రులైతే రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇతరులకు రూ.25 వేలు ఇస్తున్నారు. అన్నై థెరిస్సా పథకం కింద అనాథ యువతులకు వివాహం చేస్తున్నారు. ఈ పథకం కింద బంగారు నాణెంతో పాటు బహుమతి కూడా ఇస్తున్నారు. డాక్టర్ ధర్మమ్మాళ్ పేరుతో వితంతువులు రెండో వివాహ పథకం, డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డియార్ కులాంతర వివాహ పథకం కూడా అమలు చేస్తున్నారు. వధువు పట్టభద్రురాలు అయితే బంగారు నాణెంతో పాటు రూ.50 వేల నగదు, ఇతర యువతులకు బంగారునాణెం, రూ.25 వేల నగదు ఇస్తున్నారు. అయితే డాక్టర్ ధర్మమ్మాళ్ పథకం కింద లబ్ధి పొందాలంటే ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంది. మిగిలిన మూడు పథకాల కింద లబ్ధి పొందాలనుకునేవారికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. అదేవిధంగా గతంలో యేడాది పొడవునా 70 నుంచి 90 వేల మంది మహిళలు లబ్ధి పొందుతూ వచ్చారు. అయితే ఇపుడు బంగారం ధర పెరిగిపోయింది. దీంతో ఈ పథకాల అమలుకు అధిక భారం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు పథకాల కింద 25 వేల మంది మహిళలను ఎంపిక చేసి వివాహం జరిపించి, వారికి బంగారు నాణేలు అందజేసేందుకు వీలుగా రూ.117.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.