Good news: ఈ నెలాఖరు నుంచే.. ‘సాధారణ వందే భారత్‌’..

ABN , First Publish Date - 2023-10-07T11:48:15+05:30 IST

పేదలు ప్రయాణించేలా స్థానిక ఐసిఎఫ్‌ కర్మాగారంలో ‘సాధారణ వందే భారత్‌’ రైళ్ల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో

Good news: ఈ నెలాఖరు నుంచే.. ‘సాధారణ వందే భారత్‌’..

పెరంబూర్‌(చెన్నై): పేదలు ప్రయాణించేలా స్థానిక ఐసిఎఫ్‌ కర్మాగారంలో ‘సాధారణ వందే భారత్‌’ రైళ్ల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెలాఖరులో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పెరంబూర్‌(Perambur) సమీపంలోని ఐసిఎఫ్‌ కర్మాగారంలో తయారవుతున్న ‘వందే భారత్‌’ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కర్మాగారంలో ఇప్పటివరకు 35 వందే భారత్‌ రైళ్లు తయారుచేయగా, వాటిలో 34 రైళ్లు ప్రస్తుతం దేశంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. రైలులో ఏసీ బోగీలు, అధునాతన వసతులుండగా, ఇతర సూపర్‌ఫాస్ట్‌ రైళ్లతో పోల్చితే టిక్కెట్లు ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పేద, సామాన్య ప్రజలు కూడా ‘వందే భారత్‌’ రైళ్ల వసతులతో, ముందస్తు రిజర్వేషన్‌ లేకుండా ‘సాధారణ వందే భారత్‌’ లేదా ‘అంత్యోదయ వందే భారత్‌’ పేరుతో రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రెండు సాధారణ వందే భారత్‌ రైళ్ల తయారీ ఐసిఎఫ్‏లో చురుగ్గా సాగుతోంది. ఈ విషయమై రైల్వే అధికారులు మాట్లాడుతూ... వందే భారత్‌ రైళ్లలో ఉన్న సౌకర్యాల్లో కొన్నింటిని మార్పు చేసి, సాధారణ వందే భారత్‌ రైలు పెట్టెల తయారీని గత ఆగస్టులో ప్రారంభించామన్నారు. ఈ రైళ్లకిరువైపులా వేర్వేరు ఇంజన్లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని చిత్తరంజన్‌ కర్మాగారంలో అందుకోసం ఇంజన్లు తయారీ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ రైళ్లకు, 8 నాన్‌ రిజర్వుడు పెట్టెలు, త్రీ టైర్‌ ఏసీతో 12 పెట్టెలు, దివ్యాంగులు, లగేజీ అని మొత్తం 22 బోగీలుంటాయన్నారు. మొదటి రైలును ఈ నెలాఖరులో పరిచయం చేయనున్నామని, బోగీల నిర్మాణం పూర్తయిన వెంటనే రైల్వే శాఖకు అందిస్తామన్నారు. ఇక ఏ రైల్వే డివిజన్‌కు అందించాలనే విషయాన్ని రైల్వే బోర్డు నిర్ణయిస్తుందని అధికారులు తెలిపారు.

nani7.jpg

Updated Date - 2023-10-07T11:48:15+05:30 IST