Governor: ఢిల్లీ వెళ్లిన గవర్నర్, బీజేపీ రాష్ట్ర నేత..
ABN , First Publish Date - 2023-03-24T12:22:37+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(RN Ravi) ఆకస్మికంగా ఢిల్లీకి పయనమయ్యారు. శాసనసభలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధ చట్టం బిల్లును రెండోమారు ఏ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి(RN Ravi) ఆకస్మికంగా ఢిల్లీకి పయనమయ్యారు. శాసనసభలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధ చట్టం బిల్లును రెండోమారు ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత నెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గురువారం ఉదయం విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. సాయంత్రం ఢిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ రమ్మీ నిషేధ చట్టం బిల్లుపై కేంద్ర ప్రభుత్వంతోనూ, కేంద్ర న్యాయనిపుణులతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ వెళ్లిన అన్నామలై
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై(Annamalai) కూడా గురువారం ఉదయం విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. ప్రధాని మోదీని కలుసుకునేందుకు ఈ నెల 26న తనకు అపాయింట్‌మెంట్ కోరుతూ ఆయన ప్రధాని కార్యాలయం అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో అన్నామలై ముందుగానే ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. అన్నాడీఎంకేతో తెగతెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేయాలంటూ అన్నామలై ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల్లోనూ ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలుసుకునేందుకే ఆయన ఢిల్లీ వెళ్ళారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.