గవర్నర్ గారూ.. కాస్త నోరు అదుపులో పెట్టుకోండి..
ABN , First Publish Date - 2023-04-07T08:33:28+05:30 IST
కూడన్‌కుళం అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు విదేశీ నిధులు అందాయంటూ రాష్ట్ర గవర్నర్
పెరంబూర్(చెన్నై): కూడన్‌కుళం అణువిద్యుత్ కేంద్రానికి, స్టెరిలైట్ కర్మాగారానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు విదేశీ నిధులు అందాయంటూ రాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు మండిపడ్డాయి. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించాయి. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి(Kanimozhi), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె.బాలకృష్ణన్, సీపీఐ కార్యదర్శి ముత్తరసన్, కాంగ్రెస్ నేత గోపన్న, డీపీఐ అధినేత తిరుమావళవన్, ఎండీఎంకే నేత వైగో తదితరులు గవర్నర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘తూత్తుకుడి ఆందోళనల వెనుక విదేశీ నిధులు వినియోగించారనేందుకు ఆధారాలుంటే ఇవ్వాలి. రవి గవర్నర్‌లా వ్యవహరించడం లేదు. నోరు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. బిల్లును తిరస్కరించే అధికారం గవర్నర్‌కు ఎక్కడుంది? స్టెరిలైట్, ఆన్‌లైన్ రమ్మీకి అనుకూలంగా గవర్నర్ మాట్లాడడం ఏమాత్రం సరికాదు. గవర్నర్ పదవికి, రవి మాట్లాడే మాటలకు సంబంధమే లేదు. శాసనసభలో ఆమోదించిన బిల్లులను నిరాకరించే అధికారం గవర్నర్‌కు లేదు. గవర్నర్ అభిప్రాయాలు ప్రమాదకరమైనవి. తొలినుంచి ఆయన తప్పుడు అభిప్రాయాలే వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఆయన అవమానిస్తున్నారు. గవర్నర్‌ను వెంటనే కేంద్రప్రభుత్వం రీకాల్ చేయాలి. రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ రవి(Governor Ravi) పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. రాష్ట్ర శాసనసభలో నెరవేర్చిన బిల్లులను ఆమోదించకపోవడమంటే రాజ్యాంగధిక్కరణే. రాజ్యాంగాన్ని గవర్నర్ గౌరవించే పరిస్థితి లేదు. ఆయన వైఖరి పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధం. గవర్నర్‌కు బయటకు పంపే వరకు పోరాడడం ప్రజాస్వామిక శక్తుల కర్తవ్యం. స్టెరిలైట్ ఆందోళనలకు విదేశీ నిధులు వినియోగించారనే గవర్నర్ వ్యాఖ్యలు ఆయన అహంకారానికి పరాకాష్ట. దేశానికి వ్యతిరేకంగా విదేశీ నిధులు వినియోగిస్తున్నారని ఏ రాష్ట్ర గవర్నర్ కూడా మాట్లాడడు. ఆయన అత్యంత నీచమైన పదాన్ని స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా 30 ఏళ్లుగా పోరాడిన ప్రజల గుండెల్లో గవర్నర్ గునపం దింపారు’’ అంటూ నేతలు తూర్పారబడ్డారు.
గవర్నర్ వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం: స్టాలిన్
బహిరంగ సమావేశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్న రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తాజాగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అసత్యమైన అభిప్రాయాలను వెల్లడించి తన ప్రమాణస్వీకారానికి వ్యతిరేకంగా, రాష్ట్ర సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం శాసనసభలో చేస్తున్న అత్యవసర చట్టాలను, బిల్లులను వెంటనే అంగీకరించకుండా కాలయాపన చేస్తూ గవర్నర్‌గా తన బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నారు. ఇప్పటివరకు మా ప్రభుత్వం ప్రతిపాదించిన 14 బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. ప్రత్యేకించి ఆన్‌లైన్ రమ్మీ(Online Rummy) నిషేధం బిల్లును కుంటిసాకులు చెప్పి తిరస్కరించారు. మళ్ళీ రెండోమారు శాసనసభలో ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి పంపినా పెండింగ్‌లో ఉంచడం గర్హనీయం. ఆన్‌లైన్ రమ్మీ చట్టం చేసే అధికారం ఉందని కేంద్రమంత్రులు సైతం ప్రకటించినా గవర్నర్ ఆ బిల్లును ఆమోదించడం లేదు. ఆన్‌లైన్ రమ్మీకి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినా గవర్నర్ కఠిన వైఖరినే ప్రదర్శిస్తున్నారు. శాసనసభ చేసే బిల్లును తాను పెండింగ్‌లో ఉంచితే ఆ బిల్లుకు తన అంగీకారం లేనట్లే భావించాలంటూ గవర్నర్ తాజాగా పేర్కొనటం, అదీ విద్యార్థుల సభలో ప్రకటించడం రహస్య ప్రమాణానికి వ్యతిరేకం. ప్రమాణస్వీకారంలో పాలనాపరమైన విషయాలను బహిరంగ పరచనని ప్రమాణం చేస్తారు. గవర్నర్ ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించి సాధారణ వ్యక్తిలా సభలో ప్రభుత్వం పంపిన బిల్లులపై తన అభిప్రాయాలను బహిర్గతం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాష్ట్ర ప్రజావాణిని వినిపించే శాసనసభ గౌరవాన్నే కించపరిచేలా రవి వ్యాఖ్యలు చేయడం గవర్నర్ పదవికే మచ్చ. ఇకనైనా గవర్నర్ రాజ్యాంగం ప్రకారం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి’’ అని స్టాలిన్ హితవు పలికారు.