Governor/CM: మళ్లీ ముదురుతున్న వివాదం.. ఆ బిల్లులను గవర్నర్..
ABN , First Publish Date - 2023-05-03T08:12:07+05:30 IST
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ముప్పావు శాతం హామీలను నెరవేర్చామని
చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ముప్పావు శాతం హామీలను నెరవేర్చామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ప్రకటించారు. ‘మీలో ఒకడిని’ పేరుతో ప్రశ్నోత్తరాల రూపంలో విడుదల చేసిన వీడియోలో ఆయన పలువురు సంధించిన ప్రశ్నలకు బదులిచ్చారు. ఎన్నికల సందర్భంగా చెప్పని హామీలను సైతం అమలు చేశామన్నారు. సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్-2 దాకా చదివి ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థినులకు ప్రతినెలా వెయ్యి రూపాయల ఉపకార వేతనం, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నాన్ ముదల్వన్ పథకం పేరుతో సునిశిత శిక్షణ కార్యక్రమాలంటూ ఎన్నో అభ్యుదయ పథకాలను అమలు చేయగలిగామని చెప్పారు. శాసనసభలో చేసిన బిల్లులను రాష్ట్ర గవర్నర్(Governor) పెండింగ్‌లో ఉంచడం గర్హనీయమని, కోటానుకోట్లమంది ప్రజలద్వారా ఎన్నికైన ప్రభుత్వం చేసే చట్టాలు సైతం నియమిత గవర్నర్లు పెండింగ్‌లో ఉంచడంపై కేంద్ర ప్రభుత్వానికి తాను చేసిన తీర్మానానికి పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం మద్దతు ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వం చేసే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి తగిన కాల వ్యవధిని నిర్ణయించాలని తాను శాసనసభలో చేసిన తీర్మానాన్ని పలువురు ముఖ్యమంత్రులు స్వాగతిస్తున్నారన్నారు. పదేళ్ల అన్నాడీఎంకే(AIADMK) పాలనలో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దటానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అంతేకాకుండా అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై టెండర్ల జారీలో భారీ యెత్తున జరిగిన అవినీతిపై ఏసీబీతో సమగ్రంగా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారని గుర్తు చేస్తూ.. ముస్లింలపై కేంద్రంలోని పాలకులకు ఉన్న వ్యతిరేక భావనను ఆ ప్రకటన రుజువు చేస్తోందని దుయ్యబట్టారు. కొన్ని ప్రసార మాధ్యమాలు కూడా బీజేపీ పాలకులకు మద్దతుగా వ్యహరించడం గర్హనీయమని తెలిపారు.
ఆ ఆడియోపై చర్చ అనవసరం... : ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ సంభాషణలంటూ వెలువడిన ఆడియోపై చర్చించి తన కాలాన్ని వృథా చేయదలచుకోలేదని, బీజేపీ ఈ వ్యహారంపై నీచ రాజకీయాలకు పాల్పడుతోందని స్టాలిన్ ధ్వజమెత్తారు. ఆ ఆడియో నకిలీదని మంత్రి పళనివేల్‌రాజన్ రెండుసార్లు సుదీర్ఘ వివరణ ఇచ్చారని, ప్రస్తుతం పాలనపరమైన వ్యవహారాలపైనే దృష్టిసారిస్తున్న తాను ఈ వివాదం జోలికి పోకూడదని భావిస్తున్నానని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) శతజయంతి వేడుకలు జూన్ 5నుంచి యేడాదిపాటు భారీ యెత్తున నిర్వహించనున్నామని, రాష్ట్రపతి ఈ వేడుకలకు హాజరు కానుండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. గిండి వద్ద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్రపతి ప్రారంభిస్తారని, ఆ తర్వాత కరుణ శతజయంతి వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు, కర్మాగారాలలో పని గంటలను 12 గంటలకు పెంచే నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రజాస్వామ్యానికి తగిన గౌరవం ఇస్తున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందినట్లు కాకుండా అన్ని వర్గాల అభిప్రాయానికి గౌరవమిచ్చినట్లు భావించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలను 13 భాషల్లో జరుపుతామని కేంద్రప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని, ఇదే విధంగా రాజ్యాంగ ధర్మాసనం ఎనిమిదో షెడ్యూలలో ఉన్న 22 భాషలలోనూ పరీక్షలు జరిపే స్థితి రావాలని తాను ఆకాంక్షిస్తున్నానని స్టాలిన్ చెప్పారు. అన్నాడీఎంకే పదేళ్లపాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని కాగ్ నివేదికలే ప్రకటిస్తున్నాయని, ఈ అవినీతిపై ఏసీబీ ఆధ్వర్యంలో సమగ్రంగా విచారణ జరుపుతామని ఆయన తెలిపారు. ఇటీవల ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీ పర్యటన వల్ల ఒరిగిందేమీ లేదని, బీజేపీ పాలకులకు వత్తాసు పలకడమే ఆయన తన ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోందని స్టాలిన్ విమర్శించారు.