Delhi High Court : ఆటోరిక్షాలపై ఊబర్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్

ABN , First Publish Date - 2023-04-13T19:17:14+05:30 IST

ఊబర్ వంటి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్‌కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) షాక్ ఇచ్చింది. ఈ ఆపరేటర్లు ఆటో రిక్షాలు, ఇతర నాన్ ఎయిర్‌కండిషన్డ్

Delhi High Court : ఆటోరిక్షాలపై ఊబర్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్
Auto rikshas

న్యూఢిల్లీ : ఊబర్ వంటి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్‌కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) షాక్ ఇచ్చింది. ఈ ఆపరేటర్లు ఆటో రిక్షాలు, ఇతర నాన్ ఎయిర్‌కండిషన్డ్ వాహనాల ద్వారా ప్రయాణికులకు అందజేసే సేవలపై జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను -GST) విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఊబర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

ఆటో రిక్షాలో లేదా బస్సులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ నిర్వహించే వేదిక ద్వారా బుక్ చేసుకుంటే, అందుకు ఆ ఆపరేటర్ వసూలు చేసే ఛార్జీలు పన్ను పరిధిలోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం 2021లో జారీ చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ను ఊబర్ ఇండియా సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర పిటిషనర్లు సవాల్ చేశారు.

ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు స్పందిస్తూ, ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్లు వ్యక్తిగత సర్వీస్ ప్రొవైడర్లకు భిన్నమైన వర్గానికి చెందినవారని తెలిపింది. జీఎస్‌టీ చట్టానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లు ఉన్నట్లు తెలిపింది. వస్తువులు, సేవలను సరఫరా చేసే ప్రతి లావాదేవీపైనా పన్ను విధించాలని జీఎస్‌టీ చట్టం, 2017 చెప్తోందని తెలిపింది. అంతకుముందు పన్ను మినహాయింపులు అమల్లో ఉండేవని, ఆ మినహాయింపులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లను ఇచ్చిందని తెలిపింది. ప్రతి లావాదేవీపైనా పన్ను విధించాలనే జీఎస్‌టీ చట్టం లక్ష్యాన్ని పిటిషనర్లు వ్యతిరేకించలేదని గుర్తు చేసింది. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ల ద్వారా ఆటో రిక్షాలో కానీ, నాన్ ఎయిర్‌కండిషన్డ్ స్టేజ్ క్యారేజ్‌లో కానీ ప్రయాణించాలనుకునే వినియోగదారులకు పన్ను విధిస్తూ, అంతకుముందు ఇచ్చిన మినహాయింపులను ఉపసంహరిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్లు జీఎస్‌టీ చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. మినహాయింపులను కొనసాగించాలని కోరే హక్కు ఈ సంస్థలకు లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్లు, ఇండివిడ్యువల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య వర్గీకరణ హేతుబద్ధంగానే ఉందని, చట్టానికి అనుగుణంగానే ఉందని వివరించింది.

ఈ నోటిఫికేషన్లు భారత రాజ్యాంగంలోని అధికరణ 14 (చట్టం ముందు సమానత్వం)ను ఉల్లంఘిస్తున్నట్లు ఊబర్ ఇండియా ఆరోపించింది. పన్ను విధింపులో వ్యత్యాసాలను చూపడం సరికాదని తెలిపింది. హైకోర్టు స్పందిస్తూ, బుకింగ్ ప్రాతిపదికపై ఎటువంటి వివక్ష లేదని స్పష్టం చేసింది. ఊబర్ ఇండియా, ప్రగతిశీల్ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్, ఐబీఐబీఓ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్, మేక్ మై ట్రిప్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఏప్రిల్ 12న తీర్పు చెప్పింది.

ఇవి కూడా చదవండి :

Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ

Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..

Updated Date - 2023-04-13T19:17:14+05:30 IST