Share News

Gyanvapi case: సర్వే రిపోర్టుకు మరో 21 రోజులు గడువు కోరిన ఏఎస్ఐ

ABN , First Publish Date - 2023-11-28T15:54:00+05:30 IST

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది.

Gyanvapi case: సర్వే రిపోర్టుకు మరో 21 రోజులు గడువు కోరిన ఏఎస్ఐ

వారణాసి: జ్ఞానవాపి మసీదు కాంప్లెక్ (Gyanvapi mosque complex) శాస్త్రీయ సర్వే నివేదికను సమర్పించేందుకు మరో 21 రోజులు గడువు కావాలని భారత పురావస్తు శాఖ (ASI) వారణాసి జిల్లా కోర్టును కోరింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28వ తేదీన నివేదికను ఏఎస్ఐ సమర్పించాల్సి ఉంది. దీనికి ముందు నవంబర్ 17 వరకూ ఏఎస్ఐకు కోర్టు గడువు ఇవ్వగా ఏస్ఐ తరఫు న్యాయవాది మరో 15 రోజులు సమయం కోరారు. కాగా, టెక్నికల్ రిపోర్ట్ అందుబాటులో లేనందున ఏఎస్ఐ మరింత గడువు కోరినట్టు జ్ఞానవాసి మసీదు కాంప్లెక్స్ కేసులో హిందువుల తరఫు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తెలిపారు.


వారణాసిలోని కాశీ విశ్వనాథాలయానికి దగ్గరలోని జ్ఞానవాపి ప్రాంగణంలో ఏఎస్ఐ సర్వే జరుపుతోంది. 17వ శాతాబ్దంలో అక్కడున్న హిందూ ఆలయాన్ని కూల్చేసి దానిపై మసీదు కట్టారా అనేది నిర్దారించేందుకు ఏఎస్ఐ ఈ సర్వే చేపట్టింది. సర్వే పూర్తయిందని, నివేదిక పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని నవంబర్ 2న కోర్టుకు ఏఐఎస్ విజ్ఞప్తి చేసింది. దీంతో నవంబర్ 17 వరకూ, ఆ తర్వాత నవంబర్ 28 వరకూ గడువును కోర్టు పొడిగించింది.


సర్వేకు అనుమతి ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు

జ్ఞానవాపి వివాదంలో న్యాయకోణంలో చూసినప్పుడు ఏఎస్ఐ సర్వే తప్పనిసరని, ఇందువల్ల హిందూ, ముస్లిం వర్గాలు ఇరువురికి ప్రయోజనం ఉంటుందని వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పుతో అలహాబాద్ హైకోర్టు ఏకీభవించింది. ఏఎస్ఐ సర్వేకు మరో నాలుగు వారాలు గడువును అక్టోబర్ 5న హైకోర్టు పొడిగించింది. ఇకముందు గడువు పొడిగించేది లేదని కూడా చెప్పింది. కేసు విచారణ సందర్భంగా, ఏఎస్ఐ సర్వేకు మసీదు మేనేజిమెంట్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్వేలో బేస్‌మెంట్‌తో పాటు మసీదు కాంప్లెక్స్‌లో పలు చోట్ల ఏఎస్ఐ జరిపే తవ్వకాల వల్ల మసీదు కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జ్ఞానవాపి కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Updated Date - 2023-11-28T15:55:49+05:30 IST