Aero India-2023 : స్వదేశీ యుద్ధ విమానాల ఎగుమతికి సన్నాహాలు... రెండు దేశాలతో చర్చలు...

ABN , First Publish Date - 2023-02-14T16:59:32+05:30 IST

మన దేశంలో తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ విమానాలు (LCAs)ను విదేశీ రక్షణ దళాలకు అమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Aero India-2023 : స్వదేశీ యుద్ధ విమానాల ఎగుమతికి సన్నాహాలు... రెండు దేశాలతో చర్చలు...
Aero India-2023

బెంగళూరు : మన దేశంలో తయారు చేసిన తేజస్ లైట్ కంబాట్ విమానాలు (LCAs)ను విదేశీ రక్షణ దళాలకు అమ్మేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశీ మార్కెట్లలో కాలు మోపేందుకు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజిప్టు, అర్జంటైనా దేశాలకు ఈ విమానాలను అమ్మేందుకు భారత దేశం చర్చలు జరుపుతోంది. ఏరో ఇండియా-2023 వద్ద హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) చైర్మన్ సీబీ అనంత కృష్ణన్ ఈ వివరాలను మంగళవారం తెలిపారు.

తమకు 20 విమానాలు కావాలని ఈజిప్టు చెప్పిందని, తమకు 15 విమానాలు అవసరమని అర్జంటైనా చెప్పిందని అనంత కృష్ణన్ తెలిపారు. లోకల్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేయడంపై ఈజిప్టు ఆసక్తి ప్రదర్శించిందన్నారు. దీనికి తాము సహకరిస్తామని తెలిపారు. అర్జంటైనా వాయు సేనకు చెందిన రెండు బృందాలు హెచ్ఏఎల్‌ను సందర్శించాయని, ఎల్‌సీఏను నడిపాయని తెలిపారు. ఈ రెండు దేశాలకు LCA Mk-1A వేరియంట్‌ను ఆఫర్ చేసినట్లు తెలిపారు.

ఏరో ఇండియా 2023ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోమవారం కర్ణాటకలోని యెలహంక వైమానిక స్థావరంలో ప్రారంభించారు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో పెట్టుబడులకు భారత దేశం ఆకర్షణీయ గమ్యస్థానమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ హార్డ్‌వేర్‌ ప్రధాన ఎగుమతిదారుల్లో ఒకటిగా భారత్ దూసుకెళ్తోందన్నారు. గడచిన ఎనిమిది, తొమ్మిదేళ్ళలో దేశీయంగా నిర్మితమైన ఆయుధాల వ్యవస్థలు రక్షణ రంగంలో పరివర్తనకు దారి తీశాయన్నారు. ఈ పరివర్తనకు దారితీసినవాటిలో ఎల్‌సీఏ ఒకటి అని చెప్పారు.

ఎయిర్ షో ప్రారంభం సందర్భంగా భారత వాయు సేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ఈ ఎల్‌సీఏలో సోమవారం ప్రయాణించి, పరిశీలించారు. కొత్తగా చేసే మార్పులు, చేర్పులతో ఈ విమానాన్ని వాయు సేనలో చేర్చుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదిలావుండగా, ఎల్‌సీఏ ప్రాజెక్టు ప్రస్తుతం గాడిలో పడింది. అయితే చాలా హెచ్ఏఎల్ ప్రోగ్రామ్స్ జాప్యాల జాఢ్యానికి గురి కావడంతో రక్షణ దళాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టవలసి వచ్చింది. ప్రాథమిక శిక్షణ విమానం, ఇంటర్మీడియేట్ జెట్ ట్రైనర్, ఎల్‌సీఏ ప్రాజెక్టు వంటివి జాప్యంబారినపడ్డాయి.

Updated Date - 2023-02-14T16:59:36+05:30 IST