Haryana Violence: మోనూ మానేసర్ ఆచూకీ తెలియదు: సీఎం

ABN , First Publish Date - 2023-08-02T19:26:15+05:30 IST

రాజస్థాన్‌లో ఇటీవల ఇద్దరు ముస్లిం యువకుల మృతదేహాలు కనిపించినప్పటి నుంచి పరారీలో ఉన్న బజ్‌రంగ్ దళ్ గోసంరక్షణ కార్యకర్త మోను మానేసర్‌ గురించి రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు.

Haryana Violence: మోనూ మానేసర్ ఆచూకీ తెలియదు: సీఎం

ఛండీగఢ్: రాజస్థాన్‌లో ఇటీవల ఇద్దరు ముస్లిం యువకుల మృతదేహాలు కనిపించినప్పటి నుంచి పరారీలో ఉన్న బజ్‌రంగ్ దళ్ గోసంరక్షణ కార్యకర్త మోను మానేసర్‌ (Monu Manesar) గురించి రాష్ట్ర పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ (Manohar lal Khattar) తెలిపారు. హర్యానాలోని నుహ్‌లో వీహెచ్‌పీ చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్‌ యాత్రలో మోను మానేసర్ కనిపించాడనే వదంతలు వ్యాప్తి చెందడంతో అల్లర్లు చెలరేగి, ఆరుగురు ప్రాణాలు కోల్పోవడానికి దారితీసినట్టు చెబుతున్నారు. దీనిపై సీఎం బుధవారంనాడు స్పందిస్తూ, మోను మానేసర్ సమాచారం ఏదీ రాష్ట్ర పోలీసుల వద్ద లేదని చెప్పారు.


''అతని (మోను మానేసర్) జాడ తెలుసుకోవాలనుకుంటే అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజస్థాన్ ప్రభుత్వానికి నేను తెలియజేశాను. ప్రస్తుతం రాజస్థాన్ పోలీసులు అతని గురించి వెతుకుతున్నారు. మాకు మాత్రం అతని ఆచూకీ గురించిన సమాచారం లేదు. వాళ్లు ఎక్కడున్నారో మేము ఎలా చెప్పగలం'' అని ఖట్టార్ అన్నారు.


వాంటెడ్..!

రాజస్థాన్ జంట హత్యల కేసులో వాంటెడ్‌గా ఉన్న మోనూ మానేసర్ తప్పించుకుని తిరిగుతున్నారని, ఆయన సర్క్యులేట్ చేసిన వీడియో కొందరి ఆగ్రహానికి కారణమయిందని, ఇదే సమయంలో నుహ్‌లో జరిగిన వీహెచ్‌పీ ఊరేగింపులో అతను కనిపించాడనే వదంతులు వ్యాపించడంతో దాడులు చేటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఒక వర్గం వారు వీహెచ్‌పీ ఊరేగింపుపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపు తప్పిందని అంటున్నారు. అల్లర్లకు దిగిన దుండగులు అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక మసీదుకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టి, విధ్వంసానికి పాల్పడ్డారు. నుహ్ అల్లర్లు మంగళవారంనాడు గురుగ్రామ్‌కు విస్తరించడంతో పొరుగున ఉన్న ఢిల్లీలో సైతం అలర్ట్ ప్రకటించారు. నుహ్, గురుగ్రామ్ ఘటనలకు నిరసనగా వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు బుధవారంనాడు ఢిల్లీలో నిరనస ప్రదర్శనలు జరపడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Updated Date - 2023-08-02T19:26:15+05:30 IST