Haryana : లైంగిక వేధింపుల కేసులో మంత్రి... సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి...

ABN , First Publish Date - 2023-01-03T18:16:49+05:30 IST

మహిళా అథ్లెటిక్స్ శిక్షకురాలిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మంత్రి సందీప్ సింగ్

Haryana : లైంగిక వేధింపుల కేసులో మంత్రి... సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి...
Sandeep Singh

చండీగఢ్ : మహిళా అథ్లెటిక్స్ శిక్షకురాలిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానా మంత్రి సందీప్ సింగ్ (Sandeep Singh) రాజీనామా చేయాలనే డిమాండ్ ఉద్ధృతమవుతోంది. అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ (Manohar Lal Khattar) మాత్రం దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూస్తామని చెప్తున్నారు. సందీప్ ప్రస్తుతానికి నిందితుడేనని, నేరస్థుడు కాదని చెప్తున్నారు.

హర్యానా క్రీడల శాఖ మంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించారని ఓ జూనియర్ మహిళా అథ్లెలిక్స్ శిక్షకురాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే ఆయన క్రీడల మంత్రిగా తన బాధ్యతలను ముఖ్యమంత్రి ఖత్తార్‌కు ఆదివారం అప్పగించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని చెప్పారు. తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకే ఆమె తనపై ఇటువంటి ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.

సందీప్ రాజీనామా చేయాలని హర్యానాలోని రైతు సంఘాలు, రెండు ఖాప్ పంచాయతీలు సోమవారం డిమాండ్ చేశాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకపోతే, తాము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించాయి. సందీప్ తన పలుకుబడిని వినియోగిస్తున్నారని, అందుకే ఆయనను చండీగఢ్ పోలీసులు అరెస్టు చేయడంలేదని న్యాయవాదులు, ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్ మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సందీప్ సింగ్‌పై దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి చూస్తామని చెప్పారు. ఓ క్రీడాకారిణి ఆయనపై ఆరోపణలు చేశారని, ప్రస్తుతం ఆయన నిందితుడని, నేరస్థుడు కాదని చెప్పారు. అయితే తాము ఆయనను పదవి నుంచి తొలగించామన్నారు.

Updated Date - 2023-01-03T18:16:53+05:30 IST