High Court: దసరా వేడుకల్లో అశ్లీల నృత్యాలొద్దు
ABN , First Publish Date - 2023-09-05T09:21:43+05:30 IST
దసరా వేడుకల్లో అశ్లీల నృత్యాలను అనుమతించ రాదని, కోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని హైకోర్టు మదురై ధర్మాసనం(High Court Madurai Bench) ఆదేశించింది.
ప్యారీస్(చెన్నై): దసరా వేడుకల్లో అశ్లీల నృత్యాలను అనుమతించ రాదని, కోర్టు ఉత్తర్వులను తూచా తప్పకుండా పాటించాలని హైకోర్టు మదురై ధర్మాసనం(High Court Madurai Bench) ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా తిరుచ్చెందూర్‌కు చెందిన రాంకుమార్ ఆదిత్యన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో... తిరుచ్చెందూర్ కులశేఖరపట్టినం సముద్రతీరంలో ఉన్న ముత్తరమ్మన్ ఆలయంలో 12 రోజుల పాటు దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఉత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సినిమా పాటల పేరుతో జానపద, అశ్లీల నృత్యాలు ప్రదర్శించడంతో పాటు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించ కుండా పోలీసులను ఆదేశించాలని రాంకుమార్ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయమూర్తులు సుందర్, భరత చక్రవర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయ వాది వాదనలు వినిపిస్తూ కోర్టు అనుమతి మేరకే సాంస్కృతిక కార్యక్రమా లకు అనుమతి ఇచ్చామని, తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. 2022లో న్యాయస్థానం విపులంగా ఉత్తర్వులు జారీ చేసిందని, ఆలయ ప్రాంగణాల్లో ఎలాంటి అశ్లీల కార్యక్రమాలు చేపట్టవద్దని స్పష్టం చేసిందని గుర్తు చేసింది. మున్ముందు కూడా అశ్లీల నృత్యాలు నిర్వహించాదని తేల్చి చెప్పింది. తమ ఆదేశాలను పాటించని వారిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది.