Bihar: లడ్డూలు విసిరికొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-03-15T14:18:14+05:30 IST

ఒకరికి మోదం..ఒకరికి ఖేదం అంటే ఇదేనేమో?. తమ నాయకులకు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్రీయ జనతా దళ్ నేతలు స్వీట్లు..

Bihar: లడ్డూలు విసిరికొట్టిన బీజేపీ ఎమ్మెల్యే

పాట్నా: ఒకరికి మోదం..ఒకరికి ఖేదం అంటే ఇదేనేమో?. తమ నాయకులకు బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేతలు స్వీట్లు పంచిపెడితే, బీజేపీ (BJP) నేతలు వాటిని విసిరికొట్టిన వైనం బీహార్ అసెంబ్లీ వద్ద బుధవారం చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తే, ఆర్జేడీ ఎమ్మెల్యేలు స్వీట్లు పంచారు. దీంతో హైడ్రామా నెలకొంది. ఇరు పార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

అసెంబ్లీలో బీజేపీ విపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ లడ్డూలు పంచుతున్న సాకుతో గూండాయిజానికి వారు (ఆర్జేడీ) పాల్పడ్డారని, దీనిపై గవర్నక్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

కాగా, రైల్వే ఉద్యాగాలు ఇచ్చేందుకు ఉద్యోగార్థుల భూములను రాయించుకున్నారని (Land for Job) ఆరోపిస్తూ సీబీఐ దాఖలుచేసిన కేసులో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖఱ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, వారి కుమార్తె మీసా భారతికి ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు బుధవారంనాడు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. వారితో పాటు ఈ కేసులో ఇతర నిందితులకు కూడా కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. నిందితులంతా రూ.50,000 చొప్పున వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, అంతే మొత్తానికి జామీనును సమర్పించాలని స్పెషల్ జడ్జి గీతాంజలి గోయల్ ఆదేశించారు. తదుపరి విచారణ మార్చి 29న జరుగుతుందని తెలిపారు. లాలూ 2004-2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో ఈ కుంభకోణం జరిగినట్టు సీబీఐ అభియోగంగా ఉంది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, మీసా భారతి ఇవాళ కోర్టుకు హాజరయ్యారు.

Updated Date - 2023-03-15T14:22:55+05:30 IST