Heavy Rains: భారీ వర్షాలకు ఉత్తర భారతం విలవిల.. 40ఏళ్ల రికార్డు బ్రేక్​!

ABN , First Publish Date - 2023-07-09T17:20:50+05:30 IST

భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. భారీ వర్షాలతో ఢిల్లీ, పంజాబ్​తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా హిమాచల్​ ప్రదేశ్​లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. భారీవర్షాల ధాటికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

Heavy Rains: భారీ వర్షాలకు ఉత్తర భారతం విలవిల.. 40ఏళ్ల రికార్డు బ్రేక్​!

భారీ వర్షాలతో ఉత్తర భారతం అల్లాడిపోతోంది. ఢిల్లీ, పంజాబ్​తో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్​ ప్రదేశ్​లో భారీ వర్షాలతో నదులన్నీ పోటెత్తి వరద బీభత్సం సృష్టించింది. వరదల ధాటికి వంతెనలు, రోడ్లు, ఇండ్లు కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడి ఇండ్లు, రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల కార్లు నీటిపై తేలుతూ కొట్టుకుపోయాయి. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలో స్కూళ్లు ఆఫీసులు మూసివేశారు.

భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఉనాలో అత్యధికంగా 228 మి.మీల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రోడ్లు, ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.


రానున్న రోజుల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని జిల్లాలో ఇప్పటికే రెడ్​ అలర్ట్​ జారీ అయింది. కంగ్రా, చాంబా, హిమపూర్, కుళ్లు, మండి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సోలన్, సిమ్లా, సిర్మార్‌, సిర్మౌర్‌లలో ఆరెంజ్ అలెర్ట్.. లాహౌల్ స్పితి జిల్లాలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.


దిల్లీలో..

దిల్లీలో శనివారం నుంచి భారీవర్షాలతో దాదాపు 40ఏళ్ల రికార్డు బ్రేక్​ అయ్యింది. 24 గంటల్లో 153ఎంఎం వర్షపాతం నమోదైంది. జూలైనెలలో ఒక్క రోజులో వర్షపాతం నమోదు కావడం.. 1982 తర్వాత ఇదే మొదటిసారి. ఢిల్లీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ట్రాఫిక్​ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. విద్యుత్​ సరఫరా నిలిచిపోవడంతో అనేక ప్రాంతాల్లోని చీకటిమయం అయ్యాయి.

Updated Date - 2023-07-09T18:25:19+05:30 IST