Himanta Biswa Sarma: రాహుల్ ‘ప్రేమ దుకాణం’పై హిమంత వ్యంగ్యాస్త్రాలు.. ఆ విషయం తెలియదంటూ యూ-టర్న్
ABN , First Publish Date - 2023-09-24T22:29:19+05:30 IST
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. బీజేపీ vs ప్రతిపక్షాలుగా ఈ వివాదం మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేయగా..
బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. బీజేపీ vs ప్రతిపక్షాలుగా ఈ వివాదం మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒక ప్రకటన చేయగా.. దానిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన ముందు నిలబడే ధైర్యం రాహుల్‌కి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. రమేష్ బిధూరి వ్యవహారం మాత్రం తనకు తెలియదంటూ పెద్ద కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఆయన చేసిన తప్పు గురించి నోరెత్తకుండా.. రాహుల్ చేసిన ఓ ప్రకటనని తనదైన శైలిలో తప్పు పట్టేందుకు ప్రయత్నించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
శుక్రవారం రాహుల్ గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. ఆ తర్వాత ఆయన ట్విటర్ (X ప్లాట్‌ఫార్మ్)లో ‘‘ద్వేషం అనే మార్కెట్‌లో ప్రేమ దుకాణం’’ అని రాసుకొచ్చారు. ఇది చూసిన హిమంత బిశ్వ శర్మ.. వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘‘మన భారతదేశంలో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ద్వేషం అనేది లేనే లేదు. ‘ప్రేమ దుకాణం’ వంటి పదాలు మా నిఘంటువులో లేవు. వాళ్లు చెప్తున్న ప్రేమ దుకాణం కేవలం ఓట్ల కోసం మాత్రమే. ఒకవేళ ఏదైనా దుకాణం ఉందంటే, అది కేవలం లాభం కోసమే ఉంటుంది. మీరు ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు, దుకాణం ఎక్కడి నుంచి వచ్చింది?’’ అని చెప్పుకొచ్చారు. ప్రేమ గురించి మాట్లాడితే అందులో ఓ అర్థం ఉంటుందని, కానీ అందులో దుకాణం వస్తోందంటే అది కేవలం లాభం కోసమేనని అన్నారు. ఇక్కడ ఆ లాభం ఓట్లేనని వివరణ ఇచ్చారు.
అంతేకాదు.. రాహుల్ గాంధీకి తన ముందు నిలబడే ధైర్యం లేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. రాహుల్ ఎల్లప్పుడూ భారతదేశ ప్రజలను తక్కువగా అంచనా వేస్తారని, భారతీయులు సున్నితమైన వాళ్లని అన్నారు. భారతీయులు రాజకీయంగా బాగా పరిణతి చెందారని అన్నారు. ఇదే సమయంలో రమేశ్ బిధూరి గురించి ప్రశ్నించగా.. ఆ విషయం తెలియదంటూ ఆ ప్రశ్నని దాటవేశారు. పార్టీ ఆయనకు నోటీసులు జారీ చేసిందని, ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019 ఫలితాల కన్నా మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.