Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

ABN , First Publish Date - 2023-06-30T13:34:38+05:30 IST

దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.

Manipur : మణిపూర్ ముఖ్యమంత్రికి మద్దతుగా భారీ ప్రదర్శన

ఇంఫాల్ : దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు శుక్రవారం నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని, ఈ సంక్లిష్ట సమయంలో రాజీనామా చేయవద్దని బిరేన్ సింగ్‌ను డిమాండ్ చేశారు.

తాజాగా గురువారం మరోసారి హింస ప్రజ్వరిల్లడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. దీంతో తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బిరేన్ సింగ్ చెప్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి సచివాలయం, రాజ్ భవన్‌లకు కేవలం 100 మీటర్లలోపు దూరంలో ఉన్న నుపి లాల్ కాంప్లెక్స్ వద్దకు వందలాది మంది మహిళలు శుక్రవారం చేరుకుని, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి, తమను అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు సవాల్ విసిరారు. పోలీసులు సంచరించకుండా నిలువరించేందుకు రోడ్లపై టైర్లు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో క్షేత్రిమయుమ్ శాంతి అనే మహిళా నేత మాట్లాడుతూ, ఇది అత్యంత సంక్లిష్ట సమయమని, బిరేన్ సింగ్ ప్రభుత్వం దృఢంగా నిలవాలని, ఇబ్బందులను సృష్టిస్తున్నవారిపై కఠినంగా విరుచుకుపడాలని అన్నారు.

ఇదిలావుండగా, ఓ అధికారి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, భద్రతా దళాలు, అల్లరి మూకల మధ్య గురువారం హరావోథెల్ గ్రామం వద్ద కాల్పులు జరిగాయి. అల్లరి మూకలు ఎటువంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు బాధ్యతాయుతంగా స్పందించాయి. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మరణించడంతో, ఈ సంఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి మూడుకు చేరింది.

ఇదిలావుండగా, మణిపూర్‌లో శాంతిభద్రతల సమస్యపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం మణిపూర్ గవర్నర్‌ను కలుస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల జాబితాలో చేర్చడం గురించి పరిశీలించాలని మణిపూర్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో కుకీ తదితర తెగలవారు మే నెల నుంచి హింసాత్మక నిరసనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Make in India : మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Updated Date - 2023-06-30T13:34:38+05:30 IST