Nitish Kumar:'ఐ యామ్ సారీ.. మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా': నితీశ్ కుమార్
ABN , First Publish Date - 2023-11-08T15:56:50+05:30 IST
జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తెలిపారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు.
పట్నా: జనాభా నియంత్రణపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) తెలిపారు. తన వ్యాఖ్యలు మహిళలను బాధించి ఉంటే క్షమించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. “నేను నా మాటలను వెనక్కి తీసుకున్నా. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. స్త్రీ విద్య గురించి నేను మాట్లాడాను.కామెంట్స్ ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెబుతున్నా. క్షమించండి" అని నితీశ్ అన్నారు. జనాభా నియంత్రణపై నిన్న అసెంబ్లీలో ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ పై మహిళా సంఘాలు, విపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళా విద్య ఆవశ్యకతను నొక్కి చెబుతూ.. బిహార్(Bihar) సంతానోత్పత్తి రేటు 4.2 నుంచి 2.9 కి ఎలా పడిపోయిందని సీఎం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మహిళలు విద్యావంతులైతే జనాభా నియంత్రణలో ఉంటుందని చెబుతూ షాకింగ్ కామెంట్లు చేశారు.
‘షాదీకే బాద్ పురుష్ రోజ్ రాత్ కర్తేహేనా’ అని అంటూ.. భార్య చదువుకున్నదైతే గర్భం రాకుండా శృంగారం చేయడం ఎలా అనేది ఆమెకు తెలుసునంటూ ఓ ‘అనకూడని మాట’ అన్నారు. శృంగారం అంతా సరిగానే జరిగినా చివర్లో ‘బయటకు తీసేయాలి’ అనే విషయం చదువుకున్న మహిళలకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నితీశ్ వ్యాఖ్యలకు పురుష ఎమ్మెల్యేలు ముసిముసిగా నవ్వుకుంటే.. మహిళా ఎమ్మెల్యేలు మాత్రం తీవ్ర ఇబ్బందిపడ్డారు. నితీశ్ వాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలు కాముకత, స్త్రీ ద్వేషంతో కూడినవని.. మహిళలను తీవ్ర అవమానించేలా ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నితీశ్ వాడిన ‘పదజాలం’పై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. నితీశ్ ‘ఓ అసభ్యకరమైన నాయకుడు’ అని, ఇలాంటి వ్యక్తి భారత రాజకీయాల్లో మరొకరు కనిపించరని తూర్పారబట్టింది. మహిళలు విద్యావంతులైతే జనాభా అదుపులో ఉంటుందనే సందేశాన్ని నితీశ్ ‘అభ్యంతరకరమైన తీరు’లో కాకుండా చక్కని మాటలతో చెప్పాల్సిందని బీజేపీ నేత తారా కిషోర్ ప్రసాద్ అన్నారు. నితీశ్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ(BJP) డిమాండ్ చేయడంతో బుధవారం బిహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అయితే నితీశ్ మాటలను లైంగిక విద్య కోణంలోనే చూడాలని డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సమర్థించారు. నితీశ్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని తాఖీదు ఇచ్చింది.