ఎమ్మెల్యే రాజీనామా చేస్తే... మేమూ రాజీనామా చేస్తాం

ABN , First Publish Date - 2023-02-09T13:20:25+05:30 IST

2018ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో తమ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన లావుడ్యా రాములునాయక్‌(Lavudya Ramulunayak) తన

ఎమ్మెల్యే రాజీనామా చేస్తే... మేమూ రాజీనామా చేస్తాం

- వైరా నియోజకవర్గంలో పొంగులేటి వర్గీయుల ఎదురుదాడి

వైరా(ఖమ్మం), ఫిబ్రవరి 8: 2018ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో తమ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచిన లావుడ్యా రాములునాయక్‌(Lavudya Ramulunayak) తన పదవికి రాజీనామా చేయాలని, ఆతర్వాతనే తమ పదవులకు రాజీనామా చేస్తా మని బీఆర్‌ఎస్‌ తిరుగుబాటు నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఎదురుదాడికి దిగారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌కు దమ్ముంటే తమ నాయకుడు పొంగులేటిపై ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు. బుధవారం వైరాలో పొంగులేటి వర్గానికి చెందిన మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ తమ వర్గీయులతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను కూడా లెక్కచేయకుండా రాములునాయక్‌ను గెలిపించామని, ఆయనతోపాటే తాము మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరామని అన్నారు. తమ కష్టానికి ప్రతిఫలంగానే పదవులు వచ్చాయని అన్నారు. పొంగులేటిపై తాతా మధుసూదన్‌ చేసిన విమర్శలను తీవ్రం గా ఖండించారు. మధుకు దమ్ము, ధైర్యముంటే వచ్చే ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డిపై పోటీచేసి డిపాజిట్‌లు తెచ్చుకోవాలని సవాల్‌ విసిరారు. మధుకు కనీసం డిపాజిట్‌ వచ్చినా పొంగులేటి వర్గీయులమంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈనెల 15న వైరా అయ్యప్పస్వామి ఆలయ సమీపంలోని ఐదెకరాల స్థలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పదివేలమందితో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహి స్తామని ప్రకటించారు. తాతా మధుకు కాలం కలిసివచ్చి ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవులు లభించాయని, జోడుపదవులకు కాపాడుకునేందుకు పొంగులేటిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తమ పదవులపై అవిశ్వాస తీర్మానం పెడితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. వైరా మునిసిపల్‌ చైర్మన్‌ సూతకాని జైపాల్‌, రైతుబంధు వైరా, కారేపల్లి మండలాల కన్వీనర్లు మిట్టపల్లి నాగేశ్వరరావు, గుగులోతు శ్రీను, జూలూరు పాడు ఎంపీటీసీ సభ్యుడు తూర్పు మధుసూదన్‌రావు, పెద్దమునగాల సర్పంచ్‌ పరిక పల్లి శ్రీను, మాధారం సర్పంచ్‌ అజ్మీర నరేష్‌, తనికెళ్ల ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, జూలూరుపాడు సొసైటీ చైర్మన్‌ లేళ్ల వెంకటరెడ్డి, నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, మల్లే నాగేశ్వరరావు, పోలా శ్రీనివాస రావు, శ్రీనాథరాజు, నాగరాజు, జాలాది రామకృష్ణ, వెల్లంకి చిన్ననాగేశ్వరరావు, పుల్లారావు, యర్రా శ్రీనివాసరావు, నరేంద్ర నాయుడు, యిజ్జగాని శివ, షేక్‌ జాన్‌పాషా పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: అభ్యర్థుల ఎంపికకు కసరత్తు

Updated Date - 2023-02-09T13:20:26+05:30 IST