Red dairy controversy: మీదగ్గర ఆ డైరీ అందా? అమిత్‌షాను ప్రశ్నించిన కపిల్ సిబల్
ABN , First Publish Date - 2023-08-27T15:05:27+05:30 IST
రెడ్ డైరీ వివాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన డిమాండ్‌పై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ స్పందించారు. మీ దగ్గర ఆ డైరీ ఉందా? ఉంటే బయటపెట్టండి'' అని అమిత్‌షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత దగ్గర అలాంటి డైరీ ఏదీ లేదని అన్నారు.
న్యూఢిల్లీ: 'రెడ్ డైరీ' (Red Diary) వివాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) చేసిన డిమాండ్‌పై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ (Kapil Sibal) స్పందించారు. మీ దగ్గర ఆ డైరీ ఉందా? ఉంటే బయటపెట్టండి'' అని అమిత్‌షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత దగ్గర అలాంటి డైరీ ఏదీ లేదని అన్నారు.
అమిత్‌షా శనివారంనాడు రాజస్థాన్‌లోని గంగాపూర్ సిటీలో జరిగిన 'సహకార్ కిసాన్ సమ్మేళన్'లో మాట్లాడుతూ, తన సభలో కొందరిని నినాదాలు చేసేందుకు గెహ్లాట్ పంపించడం వల్ల ఒరిగేదేమీ లేదని, ఇప్పటికైనా సిగ్గనిపిస్తే 'రెడ్ డైరీ' అంశంపై సీఎం రాజీనామా చేయాలని అన్నారు. ఇటీవల ఎరుపు రంగు పేరు చెబితేనే సీఎం భయపడిపోతున్నారని, ఎరుపు రంగు డైరీలో చీకటి వ్యవహారాలు ఉన్నాయని, కోట్లాది రూపాయిల అవినీతి వివరాలు ఉన్నాయని ఆరోపించారు.
దీనిపై కాంగ్రెస్ మాజీ నేత సిబల్ మాట్లాడుతూ, అమిత్‌షా దగ్గర ఆ డెయిరీ ఉందా అని ప్రశ్నించారు. ఆయన దగ్గర డైరీ ఉంటే అందులోని అవినీతి వివరాలను ప్రజల ముందు బయటపెట్టాలని అన్నారు. ''మీ దగ్గర డైరీ లేదు. అందులో ఏముందో తెలియకుండా ఆరోపణలు ఎలా చేస్తారు'' అని అమిత్‌షాను నిలదీశారు.
వివాదానికి దారితీసిన రెడ్ డైరీ..
రాజస్థాన్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర గుప్తా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. జూలై 2020లో ఆదాయం శాఖ దాడులు జరిపినప్పుడు కాంగ్రెస్ నేత ధర్మేంద్ర రాథోర్ ఇంటి నుంచి సీఎం ఆదేశాల మేరకు రెడ్ డైరీ తెచ్చానని, అందులో గెహ్లాట్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని ఆరోపించారు. ఆగస్టు 2న 'రెడ్ డైరీ'కి చెందిన మూడు పేజీలను ఆయన విడుదల చేస్తూ, రాష్ట్రంలో అవినీతి, తప్పిదాలు జరుగుతున్నాయనడానికి ఇవి ఆధారాలని, రాబోయే రోజుల్లో మరిన్ని రహస్యాలు బయటపెడతానని అన్నారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ వెంటనే అందిపుచ్చుకుని గెహ్లాట్ సర్కార్‌పై విమర్శల దాడికి దిగింది.