Arvind Kejriwal: ఎన్నికలు ఎన్నయినా ఫరవాలేదు, ఒక దేశం-ఒకే విద్య అవసరం..!
ABN , First Publish Date - 2023-09-03T18:53:46+05:30 IST
ఒక దేశం ఓకే ఎన్నిక పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. కేంద్రం కొత్త జిమ్మిక్‌తో ముందుకు వచ్చిందని, ఒక ఎన్నికైనా, పది ఎన్నికలైనా, పన్నెండు ఎన్నికలైనా ఒకటేనని అన్నారు. ఇండియాకు.. ఒక దేశం, ఒకే విద్య అవసరమని అన్నారు.
భివాని: కేంద్ర ప్రభుత్వం ''ఒక దేశం ఓకే ఎన్నిక'' దిశగా పావులు కదుపుతుండటంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) విమర్శలు గుప్పించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ కేంద్రం కొత్త జిమ్మిక్‌తో ముందుకు వచ్చిందని, ఒక ఎన్నికైనా, పది ఎన్నికలైనా, పన్నెండు ఎన్నికలైనా ఒకటేనని అన్నారు. ఇండియాకు ''ఒక దేశం, ఒకే విద్య'' అవసరమని అన్నారు. ప్రతి ఒక్కరికీ సమానస్థాయి విద్య అందాలన్నారు. 'ఒక దేశం..ఒకే ఎన్నిక' అవసరం ఎంతమాత్రం లేదని, ఒక ఎన్నికైనా 1000 ఎన్నికైలైనా ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. హర్యానాలోని భివానీలో ఆదివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ కార్యక్రమలో పాల్గొన్నారు.
దీనికి ముందు ఆదివారం ఉదయం ఒక ట్వీట్‌లో కేజ్రీవాల్ 'ఒకేదేశం-ఒకే ఎన్నిక' హేతుబద్ధతను ప్రశ్నించారు. ఇందువల్ల సామాన్య ప్రజానీకానికి ఒరిగేదేమిటి? ఈ దేశానికి ఏది ముఖ్యం? ఒకదేశం ఒకే ఎన్నికలా? లేక పేద-ధనిక తారతమ్యాలు లేనివిధంగా అందరికీ సమాన విద్యా? వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ కావాలని కేజ్రీవాల్ అన్నారు.