UN Mission : మహిళా లోకం గర్వించే వార్త!

ABN , First Publish Date - 2023-01-06T20:16:27+05:30 IST

ఐక్యరాజ్య సమితి ఇంటరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ (UNISFA)లోని ఇండియన్ బెటాలియన్‌లో భాగంగా సూడాన్‌లోని అబ్యేయీలో ఓ ప్లాటూన్

UN Mission : మహిళా లోకం గర్వించే వార్త!
Indian Women Peace Keepers

న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి ఇంటరిమ్ సెక్యూరిటీ ఫోర్స్ (UNISFA)లోని ఇండియన్ బెటాలియన్‌లో భాగంగా సూడాన్‌లోని అబ్యేయీలో ఓ ప్లాటూన్ మహిళా శాంతి పరిరక్షకులను భారత దేశం శుక్రవారం నియమించింది. అందరూ మహిళలే ఉండే శాంతి పరిరక్షక దళాన్ని మొదటిసారి భారత దేశం 2007లో లైబీరియాలో మోహరించింది. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో కేవలం మహిళలు మాత్రమే ఉండే సింగిల్ యూనిట్ శాంతి పరిరక్షక దళాన్ని భారత సైన్యం (Indian Army) మోహరించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు.

భారత సైన్యం ఇచ్చిన ట్వీట్‌లో, భారత సైన్యం తన మహిళా శాంతి పరిరక్షకుల భారీ కంటింజెంట్‌ను యూఎన్ఐఎస్ఎఫ్ఏ, అబ్యేయీలోని ఐక్య రాజ్య సమితి మిషన్‌లో మోహరించినట్లు తెలిపింది. చాలా ఎక్కువ కార్యకలాపాలను నిర్వహించవలసిన, పెను సవాళ్లతో కూడిన ప్రాదేశిక పరిస్థితులు ఉండే ఈ ప్రాంతంలో ఐక్యరాజ్య సమితి జెండా క్రింద మహిళలు, బాలలకు సహాయపడటానికి ఈ మహిళా శాంతి పరిరక్షక దళం పని చేస్తుందని తెలిపింది.

దీనిపై స్పందిస్తూ మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే సంప్రదాయం భారత దేశానికి ఉందన్నారు. తాజాగా మన నారీ శక్తి భాగస్వామ్యం కావడం మరింత సంతోషకరమని పేర్కొన్నారు. ఈ పరిణామం గర్వకారణమని తెలిపారు.

ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షణ కృషికి అందరూ మహిళలే ఉండే కంటింజెంట్‌ను మోహరించిన మొదటి దేశం భారత దేశమే. 2007లో భారత సైన్యం అందరూ మహిళలే ఉన్న కంటింజెంట్‌ను లైబీరియాకు పంపించింది. వీరు లైబీరియా రాజధాని నగరం మొన్రోవియాలో 24 గంటలూ నిరంతరం గార్డ్ డ్యూటీలు చేశారు. రాత్రి వేళల్లో గస్తీ విధులను కూడా నిర్వహించారు. అంతేకాకుండా లైబీరియన్ పోలీసుల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి దోహదపడ్డారు.

అబ్యేయీకి వెళ్తున్న కంటింజెంట్‌లో ఇద్దరు ఆఫీసర్లు, 25 మంది ఇతర ర్యాంక్ సిబ్బంది ఉంటారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఘర్షణలు జరగడంతో మహిళలు, బాలలకు మానవతావాద సహాయం అందజేయవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. సరిహద్దుల నుంచి మానవతావాద సహాయం సురక్షితంగా దేశంలోకి రవాణా అవడానికి శాంతి పరిరక్షకులు భద్రత కల్పించవలసి ఉంటుంది. పౌరులను, మానవతావాద సహాయ కార్యకలాపాల్లో పాల్గొనేవారిని కాపాడటం కోసం బలప్రయోగం చేయడానికి కూడా వీరికి అధికారం కల్పించారు.

Updated Date - 2023-01-06T22:33:06+05:30 IST