World TB Summit : క్షయ వ్యాధిపై సదస్సులో మోదీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-03-24T15:18:04+05:30 IST
క్షయ వ్యాధిపై ప్రపంచం జరిపే పోరాటానికి భారత దేశంలోని పటిష్టమైన ఫార్మా ఇండస్ట్రీ గొప్ప బలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
వారణాసి : క్షయ వ్యాధిపై ప్రపంచం జరిపే పోరాటానికి భారత దేశంలోని పటిష్టమైన ఫార్మా ఇండస్ట్రీ గొప్ప బలమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుక్రవారం చెప్పారు. భారత దేశంలో 2025నాటికి క్షయ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన వన్ వరల్డ్ టీబీ సమ్మిట్ (One World TB Summit)లో ఆయన మాట్లాడారు. ప్రపంచ క్షయ వ్యాధి దినం (World Tuberculosis Day) సందర్భంగా శుక్రవారం ఈ సదస్సు జరిగింది.
క్షయ వ్యాధిపై ప్రపంచం జరిపే పోరాటానికి భారత దేశంలోని శక్తిమంతమైన ఔషధ పరిశ్రమల రంగం చాలా గొప్ప బలమని మోదీ చెప్పారు. భారత దేశం విశ్వ శాంతి, విశ్వ సంక్షేమం, ప్రపంచ శ్రేయస్సు కోసం కట్టుబడి ఉందని చెప్తూ, భారత దేశం చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యక్రమం, ప్రతి నూతన ఆవిష్కరణ ఫలాలు యావత్తు ప్రపంచానికి చేరాలని తాను ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. క్షయ వ్యాధిని 2030నాటికి నిర్మూలించాలని ప్రపంచం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ ఈ వ్యాధిని 2025నాటికి నిర్మూలించాలని భారత దేశం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ వ్యాధిపై పోరాటాన్ని 2014 నుంచి సరికొత్త ఆలోచనతో, కొత్త వైఖరితో ప్రారంభించామని చెప్పారు. ఇది మునుపెన్నడూ లేనటువంటిదని చెప్పారు. భారత దేశం చేస్తున్న కృషి గురించి యావత్తు ప్రపంచానికి తెలియాలన్నారు. క్షయ వ్యాధిపై పోరాటంలో ఇది సరికొత్త విధానమని చెప్పారు. ఈ పోరాటంలో తొమ్మిదేళ్ళ నుంచి అనేక విధాలుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, యోగా, పోషకాహారంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యంగా ఉండటం కోసం చేయవలసిన పనులపై అవగాహన కల్పించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్లు తెలిపారు.
క్షయ వ్యాధి నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యాన్ని మోదీ ప్రశంసించారు. ప్రభుత్వం కోరడంతో దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది టీబీ రోగులను దత్తత తీసుకున్నారని చెప్పారు. నవ భారతం తన లక్ష్యాల సాధనకు పెట్టింది పేరు అని చెప్పారు. బహిరంగ మల, మూత్ర విసర్జన జరగని దేశంగా మారాలని భారత దేశం నిర్ణయించుకుందని, దానిని సాధించిందని చెప్పారు. సౌర విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని కూడా మన దేశం సకాలంలో సాధించిందన్నారు.
2019 ఎన్నికల్లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి మోదీ గెలిచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
CAG Report : ఏపీ ప్రభుత్వ అప్పులు ఎన్ని లక్షల కోట్లో తెలిస్తే..
Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ కొత్త ఎత్తుగడ