Rahul Gandhi: ఇతరులను ప్రశ్నించడం సులభం, తనను తాను ప్రశ్నించుకోవడం కష్టం!
ABN , First Publish Date - 2023-04-23T16:33:59+05:30 IST
ఇతరులను ప్రశ్నించడం చాలా సులభమని, తనను తాను ప్రశ్నించుకోవడం చాలా కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ..
బాగల్‌కోట్: ఇతరులను ప్రశ్నించడం చాలా సులభమని, తనను తాను ప్రశ్నించుకోవడం చాలా కష్టమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశరాజధాని ఢిల్లీలోని బంగ్లా ఖాళీ చేసిన అనంతరం కర్ణాటకలో (Karnataka) జరిగిన బహిరంగ సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాగల్‌కోట్‌లో జరిగిన బసవ జయంతి వేడుకల్లో (Basava Jayanti celebrations) భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ ఆదివారంనాడు పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుబలీ వచ్చారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..''ఎక్కడైతే చీకటి ఉంటుందో, అదే చీకటిలో ఏదో మూల ఒక దీపం వెలుగుచూస్తుంది. ఒకానొక సమయంలో సమాజంలో చీకట్లు కమ్ముకున్నప్పుడు, చీకట్లో చిరుదివ్వెలా బసవ జీ వచ్చారు. ఒక వ్యక్తి జ్యోతిలా ప్రకాశించాలంటే ముందుగా తనను తాను ప్రశ్నించుకోవాలి. ఇతరులను ప్రశ్నించడం చాలా సులభం. కానీ, తనను తాను ప్రశ్నించుకోవడం చాలా కష్టం. ఈరోజు ఆయన (Basveshwar) ముందు పూలు ఉంచుతున్నాం. కానీ ఆయన బతికుండగా ఆయన తప్పనిసరిగా బెదిరింపులకు గురై ఉండవచ్చు. ఆయనపై దాడులు జరిగి ఉండొచ్చు. అయినా, ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. సత్యమార్గాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణంగానే ఈరోజు బసవేశ్వర్ ముందు పూలు ఉంచుతున్నాం. ఎవరికైతే బెదురు ఉంటుందో వారి ముందు ఎవ్వరూ పూలు ఉంచరు'' అని రాహుల్ కొనియాడారు.
బసవ జయంతి ఉత్సవాలలో రాహుల్ పాల్గొనడం ద్వారా లింగాయత్ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ మరింత చేరువ అవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ ఆదివారం సాయంత్రం విజయ్‌పూర్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ రోడ్‌షోలో పాల్గొంటారు. ఇదే నెలలో రాహుల్ కోలార్‌లో పర్యటించి ఎన్నికల ప్రచారం సాగించారు. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.