G-20 India presidency: జీ-20 ఆయన గొప్పేం కాదు: కాంగ్రెస్
ABN , First Publish Date - 2023-08-27T16:24:20+05:30 IST
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశం అధ్యక్షతన జి-20 సదస్సు జరుగుతోందనడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రొటేషనల్ పద్ధతిలో జి-20 ప్రెసిడెన్సీ ఉంటుందనే విషయం ఆయన (మోదీ) మరచిపోరాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేర అన్నారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధానమంత్రిగా ఉండటం వల్ల భారతదేశం అధ్యక్షతన జి-20 సమావేశం జరుగుతోందనడం సరికాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రొటేషనల్ పద్ధతిలో జి-20 ప్రెసిడెన్సీ ఉంటుందనే విషయం ఆయన (Modi) మరచిపోరాదని కాంగ్రెస్ నేత పవన్ ఖేర (Pawan Khera) అన్నారు.
''ఆయన (మోదీ) మరిచిపోయి ఉంటారు. జీ-20కి రొటేషనల్ ప్రెసిడెన్సీ ఉంటుంది. ఆయన ప్రధానిగా ఉండటం వల్ల ప్రెసిడెన్సీ రాలేదు. ఎవరు ప్రధానిగా ఉన్నప్పటికీ ఇండియాకు జి-20 అధ్యక్షత వస్తుంది. ప్రజలు ఫూల్స్ అనుకుంటే ఆయన పొరపడినట్టే'' అని పవన్ ఖేర అన్నారు.
మరింత కలుపుకోలుగా జీ-20 ఫోరం: మోదీ
దీనికి ముందు 'మన్ కీ బాత్' 104 ఎపిసోడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్ వచ్చే నెల ఢిల్లీలో జీ-20 సమావేశాలకు సిద్ధమవుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 40 దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. తొలిసారి భారత్ ఈ స్థాయి జీ-20లో భాగస్వామి అవుతోందన్నారు. మరింత కలుపుగోలుగా జీ-20ని ముందుకు తీసుకు వెళ్తామని, జీ-20కి భారత్ నేతృత్వం వహించడమంటే ప్రజలే అధ్యక్షత వహిస్తున్నట్టు భావించాలన్నారు. జీ-20 బాధ్యతలు భారత్ స్వీకరించిన నాటి నుంచి గర్వించదగిన అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. భారత్‌లోని వైవిధ్యం, ప్రజాస్వామ్యం చూసి విదేశీ అతిథులు ప్రభావితులవుతున్నారన, భారత్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని గ్రహిస్తున్నారని తెలిపారు. భారత్ గొప్పదనాన్ని సెప్టెంబర్ మాసం మరింత ఇనుమడింపజేస్తుందన్నారు. ఢిల్లీలో భారీ ఈవెంట్‌కు ముందుగా దేశవ్యాప్తంగా 60 సిటీల్లో 200 మీటింగ్‌లు ఏర్పాడు చేశామని, జి-20 అతిథులు ఎక్కడకు వెళ్లినా వారికి ఘనస్వాగతం లభించిందని చెప్పారు. ఇండియాలో ఎన్నో అవకాశాలున్నాయని అతిథులు గ్రహించారని అన్నారు.
సెప్టెంబర్ 9-10 తేదీల్లో..
జీ-20 సదస్సు సెప్టెంబర్ 9,10 తేదీల్లో ప్రగతి మైదాన్‌లోని ఐటీపీఏ కన్వెన్షన్ సెంటర్ భారత్ మండపంలో జరుగనుంది. ఈ సదస్సుకు మోదీ అధ్యక్షత వహిస్తారు. 2022 బాలీ సమ్మట్ ముగింపు సందర్భంగా జి-20 ప్రెసిడెన్సీని ఇండోనేషియా అధ్యక్షుడికి మోదీ అప్పగిస్తారు.