Jai Ram Ramesh: జై రామ్ రమేశ్ తీరుతో షాక్ అయిన విలేకరి
ABN , First Publish Date - 2023-01-23T20:16:58+05:30 IST
పుల్వామా దాడులపై దిగ్విజయ్‌సింగ్‌తో క్లారిటీ తీసుకుంటున్న సమయంలో మాట్లాడేదేమీ లేదంటూ విలేకరిని జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. చెప్పాల్సిందేమీలేదంటూ వేగంగా దూసుకొచ్చి మైకును దూరం జరిపారు. విలేకరికి, దిగ్విజయ్‌కు మధ్యలో దూరారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ విలేకరిని బలవంతంగా పంపించారు.
జమ్మూ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర వేళ ఓ వెరైటీ దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సర్జికల్ స్ట్రైక్స్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీకే చెందిన మరో సీనియర్ నేత జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. పుల్వామా దాడులపై దిగ్విజయ్‌సింగ్‌తో క్లారిటీ తీసుకుంటున్న సమయంలో మాట్లాడేదేమీ లేదంటూ విలేకరిని జైరామ్ రమేశ్ అడ్డుకున్నారు. చెప్పాల్సిందేమీలేదంటూ వేగంగా దూసుకొచ్చి మైకును దూరం జరిపారు. విలేకరికి, దిగ్విజయ్‌కు మధ్యలో దూరారు. అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ విలేకరిని బలవంతంగా పంపించారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలతో కలకలం
పాకిస్థాన్‌పై భారత్ సర్జికల్ దాడులు జరిపిందనడానికి ఆధారాలు చూపాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. అసలు సర్జికల్ దాడులే జరగలేదన్నారు. సర్జికల్ దాడులకు ఆధారాలే లేవన్నారు. నియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు జరిపిన సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను చంపేశామని అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని దిగ్విజయ్ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. 2016, 2019లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన సర్జికల్ దాడులకు సంబందించి మోదీ సర్కారు పార్లమెంట్‌కు ఆధారాలు సమర్పించలేదని దిగ్విజయ్ చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా జమ్మూలో జరిగిన బహిరంగసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలంతా ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని దిగ్విజయ్ కోరారు.
నష్ట నివారణ చర్యలకు జైరామ్ రమేశ్ శ్రీకారం
దిగ్విజయ్ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో జైరామ్ రమేశ్ ఎంట్రీ ఇచ్చారు. దిగ్విజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. సర్జికల్ దాడులపై దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని చెప్పారు. అంతేకాదు ఎన్డీయే ప్రభుత్వానికి ముందు యూపిఏ ప్రభుత్వం కూడా సర్జికల్ దాడులు జరిపిందని జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. దేశ ప్రయోజనాల కోసం సైన్యం చేపట్టే చర్యలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పటికీ ఉంటుందంటూ ట్వీట్ చేశారు.
2016, సెప్టెంబర్ 29న పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై నియంత్రణ రేఖను దాటి సర్జికల్ దాడులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాడుల్లో పాకిస్థాన్‌వైపు పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయని నాటి మోదీ ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 18న జమ్మూకశ్మీర్‌లోని యూరీలో సైనిక స్థావరంపై పాక్ ప్రేరిత నలుగురు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో 19 మంది భారత సైనికులు చనిపోయారు. ప్రతిగా పది రోజుల్లోనే భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించినట్లు భారత సైన్యానికి చెందిన డైరక్టర్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ నాడు వెల్లడించారు.
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. నాటి ఘటనలో 46 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఫిబ్రవరి 26న భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలకోట్ సమీపంలో ఉగ్రవాదుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. మరుసటి రోజు తమ దేశానికి చెందిన ఎఫ్ 16ను కూల్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను పాకిస్థాన్ బందీగా చేసుకుంది. ఆ తర్వాత మోదీ సర్కారు వ్యూహంతో పాక్ దారిలోకి వచ్చి మార్చ్ ఒకటిన అభినందన్‌ను విడుదల చేసింది.