HD Kumaraswamy: ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ సీఎం సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2023-02-28T15:09:10+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రచారానికి దిగుతుండగా..

HD Kumaraswamy: ఇవే నా చివరి ఎన్నికలు.. మాజీ సీఎం సంచలన ప్రకటన

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రకటనకు ముందే ప్రచారానికి దిగుతుండగా, జనతాదళ్ (సెక్యులర్) నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) సంచలన ప్రకటన చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే తాను పోటే చేసే చిట్టచివరి ఎన్నికలని, 2028లో తాను పోటీ చేయనని తెలిపారు. పంచరత్న ప్రచారంలో భాగంగా చెన్నెపట్నలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కుమారస్వామి మాట్లాడుతూ, తాను పోటీకి దూరమైనప్పటికీ రాజకీయాల్లో చురుకుగా ఉంటానని చెప్పారు.

''2028 అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసేది లేదు. రాజకీయాలతో బాగా అలసిపోయాను. విశ్రాంతి అవసరం. అయినప్పటికీ, యాక్టివ్ పాలిటిక్స్‌కు ఎప్పటికీ దూరం కాను'' అని కుమారస్వామి తెలిపారు. చన్నపట్న నుంచి పార్టీ క్యాడర్‌కు టిక్కెట్ ఇచ్చి, అతని విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రామనగర, చన్నపట్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కుమారస్వామి పోటీ చేశారు.

పొత్తులుండవు...

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని కుమారస్వామి స్పష్టం చేశారు. 224 అసెంబ్లీ స్థానాల్లో 123 స్థానాలు గెలుచుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఏప్రిల్, మేలో ఎన్నికలు..

కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఏప్రిల్ లేదా మే ప్రథమార్థంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2018 కర్ణాటక ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ పరిస్థితి ఏర్పడింది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ స్పష్టమైన మెజారిటీ నిరూపించుకోలేని పరిస్థితుల్లో రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత జేడీఎస్ సర్కార్ పడిపోవడంతో, 2019లో యడియూరప్ప తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2021లో ఆయన స్థానలో బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యారు.

Updated Date - 2023-02-28T15:09:10+05:30 IST