Kamal Haasan: నటుడు కమల్‌హాసన్‌ పెద్దమనసు.. షర్మిలకు కారు బహూకరణ

ABN , First Publish Date - 2023-06-27T09:46:19+05:30 IST

డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి(Kanimozhi)ని తాను నడుపుతున్న బస్సు ఎక్కించుకోవడంతో ఉద్యోగం కోల్పోయిన కోయంబత్తూ

Kamal Haasan: నటుడు కమల్‌హాసన్‌ పెద్దమనసు.. షర్మిలకు కారు బహూకరణ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డీఎంకే లోక్‌సభ సభ్యురాలు కనిమొళి(Kanimozhi)ని తాను నడుపుతున్న బస్సు ఎక్కించుకోవడంతో ఉద్యోగం కోల్పోయిన కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు బస్సు మహిళా డ్రైవర్‌ షర్మిలకు మక్కల్‌ నీదిమయ్యం అధినేత కమల్‌హాసన్‌(Kamal Haasan) కారును బహూకరించారు. కోయంబత్తూరుకు చెందిన షర్మిల గాంధీపురం- సోమనూరు మధ్య నడిచే ప్రైవేటు బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తూ వచ్చారు. మహిళా బస్‌డ్రైవర్‌గా షర్మిల చేస్తున్న సేవలను పలు సంఘాలకు చెందినవారు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం డీఎంకే ఎంపీ కనిమొళి... షర్మిల నడుపుతున్న బసెక్కి ఆమెతో ముచ్చటించారు. షర్మిలతో కరచాలనం చేసి అభినందించి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా కనిమొళికి బస్‌ టిక్కెట్‌ ఇచ్చే విషయమై షర్మిలకు కండక్టర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత షర్మిలను బస్సు యజమాని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కనిమొళి... షర్మిలకు తగిన సాయం చేసి ఆదుకుంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న కమల్‌... షర్మిలను, ఆమె కుటుంబీకులను సోమవారం చెన్నైలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అటుపిమ్మట షర్మిల జీవనోపాధి కోసం ఓ కారును బహూకరించారు. కమల్‌ పన్బాట్టు మయ్యం తరఫున ఆ కారును కానుకగా అందజేసినట్లు కమల్‌హాసన్‌(Kamal Haasan) ప్రకటించారు. షర్మిల ఇకపై డ్రైవర్‌గానే కాకుండా అద్దె టాక్సీలను నడిపే పారిశ్రామికవేత్తగా మారాలన్నదే తన ఆకాంక్ష అని కమల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

nani3.2.jpg

Updated Date - 2023-06-27T09:46:20+05:30 IST