Kanniyakumari Express: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా..

ABN , First Publish Date - 2023-06-03T07:23:50+05:30 IST

తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలో కన్నియాకుమారి ఎక్స్‌ప్రెస్‌(Kanniyakumari Express) రైలుకు పెనుముప్పు తప్పింది. గుర్తు తెలియని దుండగులు

Kanniyakumari Express: అమ్మో.. పెద్ద ప్రమాదమే తప్పిందిగా..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలో కన్నియాకుమారి ఎక్స్‌ప్రెస్‌(Kanniyakumari Express) రైలుకు పెనుముప్పు తప్పింది. గుర్తు తెలియని దుండగులు పట్టాలపై లారీ టైర్లను ఉంచి ఆ రైలును కూల్చేందుకు ప్రయత్నించారు. సకాలంలో ఇంజన్‌ డ్రైవర్‌ గమనించి రైలును ఆపేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ టైర్లు రైలింజన్‌ దిగువ కేబుల్‌ వైర్లలో చిక్కుకోవడంతో రైలింజన్‌తోపాటు నాలుగు బోగీల్లో విద్యుత్‌ ప్రసారం ఆగిపోయింది. దీంతో ఆ రైలు బోగీలు పట్టాలు తప్పకుండా సడన్‌బ్రేక్‌ వేసినట్లు ఆగిపోవడంతో పెనుముప్పు తప్పింది. శుక్రవారం వేకువజాము 1.05 గంటల ప్రాంతంలో కన్నియాకుమారి ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుచ్చి జిల్లా లాల్గుడి సమీపంలో వున్న పుదుక్కుడి గ్రామం వద్ద వెళుతుండగా పట్టాలపై ఏదో ఎత్తయిన వస్తువులు ఉన్నట్లు డ్రైవర్‌(Driver) గమనించాడు. వెంటనే రైలును ఆపేందుకు ప్రయత్నించాడు. రైలు వేగంగా నడుస్తుండడంతో దానిని అదుపు చేయలేకపోయాడు అదే సమయంలో రైలు టైర్లపైకి దూసుకెళ్లటంతో అవి ఆ టైర్లు నుజ్జునుజ్జయి రైలింజన్‌ దిగువనున్న విద్యుత్‌ కేబుల్‌ వైర్లకు చుట్టుకున్నాయి. దాంతో రైలింజన్‌లో, దాని వెనుకనున్న మూడు బోగీలలో విద్యుత్‌ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆ రైలు సడన్‌బ్రేక్‌ వేసినట్లుగా ఆగింది. దీంతో సమాచారం అందుకున్న తిరుచ్చి(Trichy) రైల్వే సాంకేతిక విభాగానికి చెందిన ఇంజనీరింగ్‌ నిపుణులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రైల్వే పోలీసులు వారిని కట్టడి చేసిన తర్వాత రైల్వే ఇంజనీరింగ్‌ నిపుణులు అరగంట సేపు శ్రమించి రైలింజన్‌ దిగువ కేబుళ్లలో ఉన్న లారీ టైర్‌(Lorry tyre) భాగాలను తొలగించడంతో పాటు నాలుగు బోగీల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. ఆ తర్వాత ఆ రైలు ఎగ్మూరుకు బయలుదేరింది.

nani2.jpg

కాగా రైల్వే డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ ప్రభాకరన్‌ ఇతర అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, లారీ టైర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద ఇటీవల రైల్వేశాఖ అధికారులు ఓ సబ్‌వేని నిర్మించేందుకు ప్రయత్నించారని, దాన్ని నిర్మిస్తే తమ పొంటపొలాల్లో సాగు జలాల ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన జరిపారు. ఆ ఆందోళన నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు లారీ టైర్లను పట్టాలపై పెట్టివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Updated Date - 2023-06-03T07:23:50+05:30 IST