Share News

Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూల్ విద్యార్థినులు..

ABN , First Publish Date - 2023-10-23T18:01:26+05:30 IST

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతేడాది రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు చెలరేగి, రాష్ట్రమంతా అల్లర్లు జరుగుతుంటే.. అప్పటి ప్రభుత్వం చోద్యం చూస్తూ...

Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇకపై స్కూల్ విద్యార్థినులు..

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు.. గతేడాది రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మధ్య మతపరమైన విభేదాలు చెలరేగి, రాష్ట్రమంతా అల్లర్లు జరుగుతుంటే.. అప్పటి ప్రభుత్వం చోద్యం చూస్తూ మౌనంగా ఉండిపోయిందే తప్ప, వివాదాలను తగ్గించే ప్రయత్నాలు చేయలేదు. ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సనాతన ధర్మం, హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ.. హిజాబ్ విషయంలో మతపరమైన భావాల్ని అణిచివేస్తోందంటూ ప్రతిపక్షాలతో పాటు ప్రజలు సైతం తీవ్రస్థాయిలో విజృంభించారు.

ఇప్పుడు ఈ వివాదాస్పద అంశంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పోటీ పరీక్షలు జరుగుతుండగా.. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలలకు హాజరు కావొచ్చని అనుమతించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం.. రాష్ట్రంలోని ముస్లిం బాలికలు అన్ని పరీక్షలకు హిజాబ్‌తో హాజరు కావడానికి అనుమతి ఇస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ ప్రకటించారు. కేవలం పాఠశాల, కళాశాల పరీక్షల్లో మాత్రమే కాదు.. అన్ని పోటీ పరీక్షల్లోనూ విద్యార్థినులను హిజాబ్ ధరించి పరీక్షకు అనుమతించినట్లు ఆయన తెలిపారు.


మహిళలు హిజాబ్ ధరించి నీట్ పరీక్షకు హాజరు కావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కాబట్టి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగానూ తప్పు కాదని మంత్రి సుధాకర్ చెప్పుకొచ్చారు. ప్రజలు తమకు నచ్చిన దుస్తులను ధరించడానికి స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. మనది సెక్యులర్ దేశమని, ప్రజలు తమకు నచ్చిన దుస్తులను ధరించే హక్కు ఈ దేశంలో ఉందని నొక్కి చెప్పారు. అయితే.. హిజాబ్ ధరించిన విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగా రావాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే ముందు.. హిజాబ్ ధరించిన విద్యార్థినులను క్షుణ్ణంగా తనిఖీ చేయబడుతుందని పేర్కొన్నారు.

మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హిందూ సంస్థలు నిరసన తెలిపాయి. బెదిరింపులకు కూడా పాల్పడ్డాయి. ఈ బెదిరింపులపై మంత్రి సుధాకర్ స్పందిస్తూ.. ఈ వ్యక్తుల లాజిక్ తనకు అర్థం కావడం లేదన్నారు. ఇతరుల హక్కుల్ని ఉల్లంఘించే ఎవరికీ ఉండదని, ఇది సెక్యులర్ దేశమని అన్నారు. కాగా.. 2022 జనవరిలో ఓ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కావడంతో, ఈ వివాదం చెలరేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ.. హిజాబ్ ధరించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated Date - 2023-10-23T18:01:26+05:30 IST