JDS Kumaraswamy, Ramya: కర్ణాటకలో ఈ ముచ్చట జోరుగా నడుస్తుందిగా.. విషయం ఏంటంటే..
ABN , First Publish Date - 2023-02-16T13:00:10+05:30 IST
జేడీఎస్ కీలక నేత, మాజీ సీఎం కుమారస్వామికు (JDS Kumaraswamy) ప్రత్యర్థిగా..
బెంగళూరు (ఆంధ్రజ్యోతి): జేడీఎస్ కీలక నేత, మాజీ సీఎం కుమారస్వామికు (JDS Kumaraswamy) ప్రత్యర్థిగా మాజీ ఎంపీ, సినీనటి రమ్య (Ex MP Ramya) పోటీ చేస్తారనేది ఊహాజనితమని అందుకు సంబంధించిన చర్చలు కాంగ్రెస్ (Congress) పార్టీలో ఎక్కడా జరగలేదని బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ (Bangalore Rural MP Suresh) తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రముఖ నేతలలో ఒకరైన కుమారస్వామిని ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏకంగా జేడీఎస్‌ను (JDS) కట్టడి చేసే ఎత్తుగడలో ఉందని కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడి సొంత జిల్లా రామనగరలో (Ramanagara) ఎక్కువ స్థానాలు సాధించడమే కాకుండా జేడీఎస్ ముఖ్యనేతకు చెక్ పెడతారనే ప్రచారం సాగింది.
కుమార స్వామికి తగిన ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ నుంచి ఎంపీగా కొనసాగి, ఆ తర్వాత కొంతకాలం పాటు జాతీయ కాంగ్రెస్‌కు సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకు రాజకీయ సన్నిహితురాలనే పేరొందిన రమ్యను పోటీ చేయిస్తారని చర్చలు సాగాయి. రమ్య పోటీ ద్వారా కుమారస్వామిని నియోజకవర్గం నుంచి గుక్కతిప్పుకోకుండా చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎన్నికలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించకుండా కట్టడి చేయదలచారు. చెన్నపట్టణ జిల్లాకేంద్రం రామనగర నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీపైనా ప్రభావం చూపేలా ప్రయత్నించినట్లు తెలు స్తోంది.
రమ్య పోటీ చేస్తారనే సమాచారంతో జేడీఎస్‌కు గుబులు పట్టుకుంది. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే జేడీఎస్ ఉనికి లేకుండా పోతుందనే చర్చలు సాగాయి. అయితే ఒక్కసారిగా బుధవారం డీకే సురేష్ మీడియా ముందుకు వచ్చిన చెన్నపట్టణ నుంచి రమ్య పోటీ చేస్తారనేది కేవలం కొందరు పుట్టించిన ప్రచారం మాత్రమే అన్నారు. రమ్య పోటీ చేసే విషయమై కాం గ్రెస్ లో ఎక్కడా చర్చలు జరగలేదన్నారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో ఇరువురి మధ్య ఒక అవ గా హన ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కుమారస్వామి ప్రతినిత్యం ప్రతిపక్షనేత సిద్దరామయ్యపై విరుచుకుపడుతుంటారు. కానీ ఎక్కడా డీకే శివకుమార్‌పై విమర్శలు చేయరు. ఇరువురి మధ్య ఉండే సంబంధమే కారణమనే విమర్శలు ఉన్నాయి. ఎంపీ డీకే సురేష్ స్పందించడానికి ఇదే కారణమని తెలుస్తోంది.