Karnataka congress: బియ్యానికి బదులు నగదు... ఉచిత హామీల పర్యవసానం..!
ABN , First Publish Date - 2023-06-28T17:02:35+05:30 IST
కర్ణాటక కాంగ్రెస్‌కు 5 ఉచిత హామీల అమలు విషయంలో ఎదురీత తప్పడం లేదు. ఇందుకోసం కొన్ని సర్దుబాట్లకు మొగ్గుచూపుతోంది. 'అన్న భాగ్య' పథకం కింద అదనపు బియ్యం సేకరణ కష్టంగా ఉండటంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌కు (Karnataka Congress) 5 ఉచిత హామీల (Five Guarantees) అమలు విషయంలో ఎదురీత తప్పడం లేదు. పథకాలు ముందుకు తీసుకు వెళ్లాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సర్కార్ ఉన్నప్పటికీ కొన్ని సర్దుబాట్లకు మొగ్గుచూపుతోంది. 'అన్న భాగ్య' పథకం కింద అదనపు బియ్యం సేకరణ కష్టంగా ఉండటంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వం బియ్యం సేకరణ జరిపేంత వరకూ ఈ విధానాన్ని అమలు చేయాలని కర్ణాటక మంత్రివర్గం బుధవారంనాడు జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
మంత్రివర్గ నిర్ణయం ప్రకారం బీపీఎల్ కార్డుదారులకు మార్కెట్ ధర ప్రకారం 5 కేజీల బియ్యం సొమ్మును వారి అకౌంట్లకు జమ చేస్తారు. ఇందువల్ల ప్రభుత్వంపై రూ.750 కోట్ల నుంచి 800 కోట్ల భారం పడుతుంది. బీపీఎల్ కార్డుహోల్డర్‌కు ప్రతి నెలా బియ్యానికి బదులు రూ.170 ఇస్తారు. దీనిపై రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి కేహెచ్ మునియప్ప మాట్లాడుతూ, జూలై 1 నుంచి అన్నభాగ్య పథకాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు బీఎల్‌ఎల్ కార్డ్‌హోల్డర్లకు 5 కిలోల బియ్యానికి బదులు నగదు బదిలీ చేస్తామని, బియ్యం సేకరణ జరిగేంత వరకూ ఈ పద్ధతి నడుస్తుందని తెలిపారు. జూలై నుంచి నగదు బదిలీ ఉంటుందన్నారు. రాష్ట్రానికి బియ్యం అందించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరాకరించడంతో, బియ్యం సేకరణ కోసం ఎన్‌పీఏఏడీ వంటి కేంద్ర ఏజెన్సీలతో కర్ణాటక ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు.
మోకాలడ్డిన కేంద్ర: సిద్ధరామయ్య
కాగా, తమకు బియ్యం ఇవ్వడానికి కేంద్రం నిరాకరించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మార్గె్ట్ ధర ఇచ్చేందుకు తాము సిద్ధపడినప్పటికీ కేంద్రం బియ్యం ఇవ్వడానికి నిరాకరిస్తోందని చెప్పారు. ''మా పథకాన్ని ఆపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందువల్ల పేదలకు నష్టం కలిగిస్తుంది. దీంతో బియ్యానికి బదులుగా మేము నగదు ఇవ్వాలని నిర్ణయించాం. బీపీఎల్ కుటుంబంలో నలుగురు సభ్యులుంటే రూ.680 ఇవ్వడం జరుగుతుంది'' అని ఆయన తెలిపారు.
బీపీఎల్ హోల్టర్లకు 10 కేజీలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, ఇందులో 5 కేజీలు కేంద్రం నుంచి వస్తుంది. తక్కిన బియ్యాన్ని రాష్ట్రం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, గడువులోగా బియ్యం సేకరణ జరగకపోవడంతో బీపీఎల్ కార్డ్‌హోల్లర్లకు 5 కేజీల బియ్యానికి బదులు నగదు బదిలీ చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.