DK Shivakumar: డీకే ఆస్తులు ఐదేళ్లలో ఎంత శాతం పెరిగాయో తెలుసా?
ABN , First Publish Date - 2023-04-18T19:19:22+05:30 IST
కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఎన్నికల సంఘానికి తన ఆస్తులను ప్రకటించారు.
బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (Karnataka Congress chief DK Shivakumar) ఎన్నికల సంఘానికి తన ఆస్తులను ప్రకటించారు. ఐదేళ్లలో తమ ఆస్తులు 68 శాతం పెరిగాయంటూ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుటుంబ ఆస్తుల విలువ 1414 కోట్ల రూపాయలని ఆయన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మంగళవారం ఆయన కనకపుర నియోజకవర్గం (Kanakapura constituency) నుంచి నామినేషన్ వేశారు. రానున్న ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. నామినేషన్ వేస్తున్న ఫొటోను కూడా ఆయన జత చేశారు. అంతకు ముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో కూడా నిర్వహించారు. కనకపుర నుంచి డీకే ఏడుసార్లు గెలిచారు. ఇక్కడ బీజేపీ తరపున మంత్రి ఆర్.అశోక తలపడుతున్నారు.
2013లో డీకే శివకుమార్ ఎన్నికల సంఘానికి ప్రకటించిన ఆస్తుల విలువ 251 కోట్ల రూపాయలు. 2018లో ఆయన ఆస్తుల విలువ 840 కోట్ల రూపాయలు. శివకుమార్‌కు మొత్తం 12 బ్యాంక్ అకౌంట్లున్నాయి. సోదరుడు డీకే సురేశ్‌తో కలిసి ఉన్న జాయింట్ అకౌంట్లివి. ప్రస్తుతం ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ 1414 కోట్ల రూపాయలు. డీకే పేరిట 225 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది. ఆయన పేరిట 8 లక్షల 30 వేల రూపాయల విలువైన టొయోటా కారు ఒకటుంది. డీకే పేరిట 970 కోట్ల రూపాయల స్థిరాస్థులున్నాయి. ఆయన భార్య ఉషా పేరిట 113. 38 కోట్ల రూపాయల స్థిరాస్థి ఉంది. డీకే కుమారుడు ఆకాశ్ పేరిట 54.33 కోట్ల రూపాయల స్థిరాస్థి ఉంది. డీకే ఒక్కరి మొత్తం ఆస్తుల విలువ 1214.93 కోట్ల రూపాయలు కాగా ఆయన భార్య పేరిట 133 కోట్ల రూపాయలు, కుమారుడి పేరిట 66 కోట్ల రూపాయల ఆస్తి ఉంది.
డీకే శివకుమార్ వార్షికాదాయం 14.24 కోట్ల రూపాయలు. డీకే భార్య వార్షికాదాయం 1.9 కోట్ల రూపాయలు.
కాంగ్రెస్ పార్టీ 200 మందికి పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 224 స్థానాలకుగాను బీజేపీ ఇంతవరకు 222 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 150 మందికి పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కర్ణాటకలో త్రికోణ పోటీ నెలకొంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ, కొన్ని ప్రాంతాల్లో జేడీఎస్ బలంగా ఉన్నాయి. నేతలంతా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు తమదే అనే కాంగ్రెస్, బీజేపీ ధీమాగా ఉన్నాయి. కింగ్ మేకర్ తామే అవుతామని జేడీఎస్ అంచనా వేస్తోంది.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతీఖ్ హత్య తర్వాత తొలిసారి స్పందించిన యోగి...
Jagadish Shettar: ఆయన వల్లే తాను బీజేపీ వీడాల్సి వచ్చిందన్న కర్ణాటక మాజీ సీఎం
Ajit Pawar: క్లారిటీ ఇచ్చిన అజిత్ పవార్... ఇంతకూ ఎన్సీపీలో ఏం జరుగుతోంది?