DK Shivakumar: ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో డీకే శివకుమార్‌కి షాక్.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
ABN , First Publish Date - 2023-10-19T12:03:10+05:30 IST
ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్ ను సవాలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)కి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది.
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమార్కుల కేసులో సీబీఐ(CBI) ఎఫ్ఐఆర్ ను సవాలు చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shivakumar)కి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సవాలు చేస్తూ డీకే శివకుమార్ హైకోర్టు(Karnataka High Court)లో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన కోర్టు.. కేసులో విచారణ చాలా వరకు పూర్తయినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోవడం సరైనది కాదని జస్టిస్ కె.నటరాజన్ అభిప్రాయపడ్డారు.
3 నెలల్లో విచారణ ముగించి తుది నివేదికను సమర్పించాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో డీకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అక్టోబర్ 2, 2020న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను డీకే శివకుమార్ సవాలు చేశారు. ఫిబ్రవరి 2023లో విచారణ చేసిన కోర్టు తీర్పుపై స్టే విధించింది. 2013-2018 మధ్య కాలంలో డీకే, అతని కుటుంబ సభ్యులు రూ.74 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి బీజేపీ(BJP) డీకే శివకుమార్ పై విమర్శలు ప్రారంభించింది. అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.