Sand mafia: కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో తొక్కి చంపిన ఇసుక మాఫియా
ABN , First Publish Date - 2023-06-16T14:34:52+05:30 IST
కర్ణాటకలోని కలబురగిలో మరోసారి ఇసుక మాఫియా పంజా విసిరింది. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి పొట్టనపెట్టుకుంది. జవర్గి తాలూకా నారాయణపూర్ సమీపంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
కలబురగి: కర్ణాటక (Karnataka)లోని కలబురగిలో మరోసారి ఇసుక మాఫియా (Sand mafia) పంజా విసిరింది. విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను (Constable) ట్రాక్టర్‌తో ఢీకొట్టి పొట్టనపెట్టుకుంది. జవర్గి తాలూకా నారాయణపూర్ సమీపంలో శుక్రవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నెలొగి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న 51 ఏళ్ల మౌర్య అక్రమ ఇసుక ట్రాక్టర్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు. అయితే డ్రైవర్ ఆపకుండా అతన్ని ఢీకొట్టి, అంతే వేగంగా అక్కడించి పరారయ్యాడు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ మౌర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆ కొద్ది సేపటికే ట్రాక్టర్ డ్రైవర్ సిద్ధన్నను పోలీసులు అరెస్టు చేశారు. తాను నేరం చేసినట్టు డ్రైవర్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. కానిస్టేబుల్‌ను ఇసుక మాఫియా పొట్టనపెట్టుకున్న ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలిపారు.
కాగా, కానిస్టేబుల్‌ను ట్రాక్టర్‌తో గుద్దించి చంపిన ఘటనపై ఐపీసీలోని సెక్షన్ 302,333,307,379,504,506 కింద కేసు నమోదు చేశామని, దీని వెనుక ఎవరున్నప్పటికీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని కలబురగి ఎస్‌పీ ఇషా పంత్ తెలిపారు.