Karnataka polls: 5 ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు, గర్భిణీలకు రూ.36,000 సాయం

ABN , First Publish Date - 2023-04-15T15:04:54+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జేడీఎస్ నేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ 12 పాయింట్లతో ..

Karnataka polls: 5 ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు, గర్భిణీలకు రూ.36,000 సాయం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జేడీఎస్ (JDS) నేత, మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda) 12 పాయింట్లతో ఎన్నికల మేనిఫెస్టో (Election Manifesto)ను శనివారంనాడు విడుదల చేశారు. మహిళా సాధికారిత, రైతుల అభివృద్ధికి మేనిఫెస్టోలో పార్టీ పెద్దపీట వేసింది. స్త్రీ శక్తి గ్రూపులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఏడాదిలో 5 ఎల్‌పీజీ సిలెండర్లు (LPG Cylinders) ఉచితంగా ఇస్తామని, గర్భిణీ స్త్రీలకు ఆరు నెలల పాటు ప్రతి నెలా రూ.6,000 చొప్పున అలవెన్స్ ఇస్తామని, వితంతు పెన్షన్లను రూ.900 నుంచి రూ.2,500కు పెంచుతామని, 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి పెన్షన్లు ఇస్తామని వాగ్దానం చేసింది.

రైతులకు ఎకరాకు రూ.10,000 సబ్సిడీ అందిస్తామనే ప్రతిపాదన కూడా జేడీఎస్ చేసింది. వ్యవసాయ కూలీలకు నెలవారీ రూ.2,000 అలవెన్సు ఇస్తామని, వ్యవసాయం వృత్తిగా తీసుకునే యువకులను పెళ్లి చేసుకునే మహిళలకు రూ.2 లక్షల సబ్సిడీ ఇస్తామని తెలిపింది. సివిల్ సర్వీసు, డిఫెన్స్ రిక్రూట్‌మెంట్లలో పరీక్షలు కన్నడంలో నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వాగ్దానం చేసింది. తమకు అధికారం ఇస్తే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం తీసుకువచ్చామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థినులకు 6.8 లక్షల సైకిళ్లు, 60,000 మోపెడ్లు పంపిణీ చేస్తామని, జిల్లాకు ఒకటి చొప్పున మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెస్తామని తెలిపింది. కాగా, జేడీఎస్ ఇంతవరకూ రెండు జాబితాల్లో 142 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరో 82 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2023-04-15T15:07:48+05:30 IST